-
కుదరని పెళ్ళిసంబంధం
కుదరని పెళ్ళిసంబంధం
శ్రీపురం గ్రామస్థుడైన పరంధామయ్యకు ఒక్కగానొక్క కూతురు శారద. ఆమెకు యుక్త వయస్సురాగానే పరంధామయ్య పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించాడు. రాజధానిలో ఉంటున్న అతని బాల్యస్నేహితుడు కోదండానికి విదేశంలో పని చేస్తున్న పెళ్ళి కెదిగిన కొడుకున్నాడని ఆయనకు తెలిసింది. మంచిరోజు చూసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు. పరంధామయ్యను చూడగానే, కోదండం చాలా సంబరపడ్డాడు. ఆప్యాయంగా పలకరించి కుటుంబసభ్యులందరినీ పరిచయంచేశాడు. భోజనాలయ్యాక, పరంధామయ్య పాలకొచ్చి ముంతదాచుకోవడం ఎందుకని అసలువిషయంచెప్పాడు. అంతావిన్న కోదండం, "అబ్బాయి విదేశంలో ఉన్నాడు. ఎప్పుడువచ్చేదీ తెలియదు. మీ ఊరు మేమువచ్చి, శారదను చూసి, వివరాలు మా అబ్బాయికి తెలియజేస్తాము. ఆ తరువాత అతడి ఇష్టం," అన్నాడు.
వారం తిరక్కుండానే కోదండం, ఆయన భార్య శ్రీపురం వచ్చి శారదను చూసి, జాతకం తదితర వివరాలు సేకరించుకుని వెళ్ళారు. కోదండం కుటుంబం, మంచి పేరు సంప్రదాయం కలిగిన కుటుంబం. పిల్లలు బుద్ధిమంతులు. తల్లిదండ్రుల మాట జవదాటని వారు, అని కోదండాన్ని ఎరిగిన వారంటున్నారు. ఏలోటూలేని కుటుంబంగనక, కోదండం తన కూతురిని కోడలుగా చేసుకుంటే బావుంటుందనుకున్నాడు పరంధామయ్య. అయితే, పల్లెటూరిపిల్ల శారద, కోదండం దంపతులకు నచ్చలేదు. నెలతిరక్కుండానే కోదండం దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది, జాతకాలు కుదరలేదని.
పరంధామయ్య ఉత్తరం చదువుకుని పైకి ఏమాత్రం విచారం కనపరచకుండా, ఆనందం నటిస్తూ, "హమ్మయ్య! నా ఒక్క సమస్య తీరిపోయింది!" అన్నాడు. "అంత సంబరపడేవిషయం, అందులో ఏముంది?" అని అడిగింది భార్య ఆశ్చర్యంగా. "కోదండం నా చిన్ననాటి స్నేహితుడు. ఆయన స్వభావం నాకు తెలుసు. ఆయన కొడుకు ఎలాంటివాడో ఎలాతెలుస్తుంది? జనని, జన్మభూమి స్వర్గంకంటే గొప్పవని అంటారు. పొట్టకూటి కోసం జన్మభూమినే వదిలిన వాడు భార్యాపిల్లలను ఎలా చూసుకుంటాడో చెప్పడం కష్టం. విదేశంలో వుండడానికి అధికార పత్రాలు రావడానికి రెండుసంవత్సరాలు పడుతుందట! పిల్లలకు పెళ్ళి చేసేది తిరిగి మన నెత్తిన పెట్టుకోవడానికా? అమ్మాయి విదేశంలోవుంటే దాని కష్టసుఖాలుచూడటం మనకు సాధ్యమవుతుందా? కోదండం తన కొడుక్కి మనమ్మాయిని చేసుకుంటానంటే ఎలా కాదని చెప్పటమా అని సతమతమవుతుంటే, ఈ ఉత్తరం వచ్చింది. నా సమస్య తీరిపోయింది," అన్నాడు పరంధామయ్య నవ్వుతూ.
అందని ద్రాక్షపళ్ళు పుల్లన!