-
తగినభార్య
తగినభార్య
కొండాపురం అనే పల్లెలో వుండే కొండయ్య అనే యువకుడు, ఒక రైతు కొడుకు. వాడు పొలం పనుల్లో తండ్రికి చేదోడుగా వుండక, ఆదేశపు రాజకుమార్తెను పెళ్ళాడి, రాజుకావాలని పగటికలలు కంటూండేవాడు. చూసి, చూసి వాడి తండ్రి ఒక రోజున వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టేశాడు. కొండయ్యకు ఇది శుభసూచకంగా కనిపించింది. వాడు తిన్నగా రాజధాని నగరం చేరి, మేనమామ సింగన్న ఇంటికి వెళ్ళాడు. ఈ సింగన్న ఒకప్పుడు రాజుగారి సైన్యంలో పనిచేసి ధైర్యసాహసాలకు రాజు చేత బహుమతులు పొందినవాడు. ఇప్పుడు సింగన్న కూతురు మల్లిక, రాజకుమారి ప్రియంవదకు ప్రధాన చెలికత్తెగా వుంటున్నది.
కంటికి నదురుగా వున్న కొండయ్యను చూసి సింగన్న చాలా సంతోషించాడు. ఇలాంటివాడికి రాజుగారి కొలువులో ఉద్యోగం ఇప్పించడం చాలా తేలిక. ఆ తర్వాత, తన కూతురు మల్లికనిచ్చి పెళ్ళిచేసి తన ఇంటనే వుంచుకోవచ్చు! సింగన్న ఇలా ఆలోచించి, మర్నాడు కొండయ్యకు సంగతి చెప్పాడు. వాడు రాజుగారి కొలువులో ఉద్యోగం అంటే సంతోషపడ్డాడు కానీ, మల్లికతో పెళ్ళి అంటే ఏమాత్రం ఇష్టంలేదు. అయితే, వాడాసంగతి బయటపెట్టకుండా, ముందుకోటలో పాగా కోసం, సరేనన్నట్టు తల ఊపాడు.
మొదట సింగన్న, కొండయ్యకు సైనికుడి ఉద్యోగం ఇప్పించాలని చూశాడు. అందుకు వాడు ఒప్పుకోలేదు. డాలూ కత్తి పట్టి, నగరం వదిలి ఎక్కడెక్కడో కొండల్లో, అడవుల్లో తిరగడం తనకు ఇష్టంలేదన్నాడు. సరే, నగరంలోనే రాత్రివేళ గస్తీ తిరిగే భటుడి ఉద్యోగం వేయిస్తానన్నాడు సింగన్న. దానికి వాడు ఒప్పుకోక, ఏ ఈటో పట్టుకుని చీకట్లో కాళ్ళరిగేలా వీధుల వెంట తిరగడం, నాకు చిన్నతనం గా వుంటుంది, అనేశాడు.
ఈ సంభాషణ విన్న మల్లిక, కొండయ్య అడక్కుండానే రాత్రిళ్ళు కోటలో జాము జాముకు గంటలు కొట్టి సమయం తెలియజేసేవాడి పని ఇప్పించింది. వాడు ఉద్యోగంలో చేరి రోజులూ, వారాలూ గడిచి నెల ముగిసిపోయినా, రాకుమారి వాడికంట బడలేదు. వాడిక వుండబట్టలేక, ఆ ప్రాంతాల మొక్కలకు పాదులు చేసే వృద్ధుడొకడిని రాకుమారి ఇటుకేసి ఎప్పుడొస్తుందని అడిగాడు.
దానికి వృద్ధుడు నవ్వి, "రాకుమారిగారికి ఇటు రావలసిన అవసరమేమిటి! ఆమె దూరాన ఎత్తయిన ఆ గోడ అవతలనున్న పూలతోటలో చెలికత్తెలతో కలిసి విహారం చేస్తుంది. అక్కడే కొలనులో జలకాలాడుతుంది. తర్వాత అంతఃపురానికి వెళ్ళిపోతుంది. అంతగా రాకుమారిని చూడాలని వుంటే, ఒకటి, రెండు నెలలు ఓపిక పట్టు. రాజుగారామెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళి ముహూర్తం నాడు, మనబోటి వాళ్ళందరం ఆమెను చూడవచ్చు," అన్నాడు.
రాకుమారికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారన్నమాట వినగానే, కొండయ్యకు గుండె పట్టినట్టయింది. వాడిక ఆలస్యం చేస్తే, ఆమె చేయిజారిపోతుందని, ఒక ఉపాయం ఆలోచించాడు. దాని ప్రకారం వాడు మర్నాటి సంధ్యవేళ రాకుమారికి పూలు తీసుకుపోతున్న దాసిని పలకరించి మాటల్లో పెట్టి, అంతకు ముందే రాసివుంచుకున్న చీటీని, దాసీకి తెలియకుండా, ఆమె చేతనున్న పూలబుట్టలో జారవిడిచాడు.
దానిలో వాడు – "మీకోసం నేను రాజధానికి పది ఆమడలదూరంలోవున్న పల్లె నుంచి వచ్చాను. ఇందుకు నేను, ఒక చిట్టడవినీ, రెండు చిన్ననదులనూ దాటడమేగాక, కొండప్రాంతాల నడిచి ఎన్నో శ్రమల కోర్చాను. ఇదంతా మీ కోసమే. ఇప్పుడు రాత్రివేళ గంటలు కొట్టే చాకిరీ కూడా మీ కోసమే చేస్తున్నాను – కొండాపురం కొండయ్య," అని రాశాడు. అయితే, దాసిది పూలబుట్టతో వెళ్ళిపోయాక, కొండయ్యను రకరకాల భయాలు పట్టుకున్నవి. రాజుకు కోపం వస్తే చండశాసనుడని చెప్పడానికి, కోటలో ఉద్యోగుల మధ్య అనేక కథలు ప్రచారంలో వున్నాయి. ఒక వేళ తన రోజులు బాగోక, రాకుమారి ఒళ్ళుమండి చీటీని రాజుకు చూపిస్తే, తన పరిస్థితి ఏమవుతుందో అని వాడికి దిగులు పుట్టింది. తను చేసినపని కొరివితో తల గోక్కోవడంలాంటిదని వాడు చింతింపసాగాడు. క్రమంగా వాడారాత్రి మతిస్థిమితం తప్పి ఉన్నాడిలా ప్రవర్తించాడు.
ఆ రాత్రి కొండయ్య మొదటి జామున కొట్టవలసిన గంట కొట్టనేలేదు. రెండోజామున ఏకంగా మూడుగంటలు మోగించాడు. మూడుసార్లు గంట మోగేసరికి, రాజు దిగ్గున హంసతూలికాతల్పం మీద లేచి కూర్చున్నాడు. రోజూ ఆయనకు రాత్రిమూడో జామున నిద్రలేచే అలవాటున్నది. దాసీలు వచ్చి తనను మేలుకొలపనందుకు ఆయన ముందు ఆశ్చర్యపోయి, తర్వాత కోపంగా చప్పట్లు చరిచాడు. ఆ చప్పట్లు విని బిలబిలమంటూ అక్కడికి వచ్చిన దాసీలను ఆయన గట్టిగా కసిరాడు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఉపాహారంకోసం వస్తే, వంటగది చీకటిమయంగా వున్నది. హతాశుడైన రాజు, ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఐతే, ఎంతకూ నాలుగో గంట మోగనే లేదు. అప్పుడాయన కాపలా భటుణ్ణి పిలిచి ప్రశ్నిస్తే, మూడోజాము సగంలోనే వున్నదని తెలిసింది. దాంతో ఆగ్రహించిన రాజు, కొండయ్యకోసం భటుల్ని పంపాడు. రాజు నుంచి కబురందగానే, చీటీ విషయం ఆయనకు తెలిసిపోయివుంటుందనీ, ఇక తనకు ఏ ఉరిశిక్షో, ఉప్ప పాతరో తప్పదనీ అనుకున్నాడు, కొండయ్య. వాడు అక్కణ్ణించి పారిపోవాలని అటూ ఇటూ చూశాడు. కాని, ఈటెలు పట్టిన ఇద్దరు భటులు వాడికేసి గుడ్లురుముతూ చూస్తున్నారు. వాడు జారిపోతున్న గుండెను చిక్కబట్టుకుని భటుల వెంట బయల్దేరాడు. కొండయ్యను చూసి రాజు మండిపడి, "ఒరే, నువ్వేనా రాత్రివేళ జాముగంటలు కొట్టేది?" అని ప్రశ్నించాడు.
కొండయ్యకు జవాబిచ్చేందుకు గొంతు పెగలక, అవునన్నట్లు తలవూపాడు వణుకుతూ. ఇది చూసి రాజుకు వాడిపై జాలికలిగింది. ఆయన ఈసారి కాస్త మృదువుగా, "ఒరే, ఎన్నాళ్ళుగా ఈ ఉద్యోగం చేస్తున్నావు?" అన్నాడు.
"మహారాజా! రెండో నెలగడవబోతున్నది," అని జవాబిచ్చాడు కొండయ్య తడబడుతున్న గొంతుతో. రాజు, వాణ్ణి ఒకసారి పరీక్షగా చూసి, "మంచి ఒడ్డూ పొడుగూ, ఇంత దేహదారుఢ్యం వున్న నీకు, ఏ సైనికుడి ఉద్యోగమో ఇవ్వక, ఇక్కడ రాత్రివేళ గంటలు కొట్టే చచ్చుపని ఇచ్చిన వాళ్ళెవరో తెలియదు. సరే, ఒక్కవారం రోజులపాటు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయ్యి. తర్వాత నిన్ను, సేనానాయకుడికి చెప్పి సైన్యంలో చేరేలా చూస్తాను. నువ్వు కత్తిబట్టి మన సరిహద్దుల్లో నిలబడితే, శత్రుసైనికులు తిరిగి చూడకుండా పారిపోగలరు!" అన్నాడు నవ్వుతూ.
కొండయ్య, రాజుకు నమస్కరించి బతుకు జీవుడా అనుకుంటూ అక్కణ్ణించి బయలుదేరాడు. కాని, వాడికి తను రాకుమారికి రాసిన చీటీ సంగతి ఏ క్షణానయినా రాజుకు తెలిసిపోతుందనీ, అప్పుడు తనను రాజు కఠినంగా శిక్షిస్తాడనీ బెంగ కలిగింది. వాడు తలవంచుకుని కోటద్వారం కేసి నడుస్తూండగా, మల్లిక వాడికి ఎదురుపడి, "ఆహాఁ, బావా! నువ్వా దిక్కుమాలిన పల్లె వదిలి ఇక్కడికి వచ్చింది నా కోసమని నేనెరగననుకున్నావా? నాకు నీ మనసులో ఏమున్నదీ తెలియజెప్పటానికి పూలబుట్ట దొరికిందా? పూలమాలను నేనే కట్టి రాకుమారిని అలంకరిస్తూంటాను గనక, ఆ చీటీ నాకు దొరికింది. ఏదైనా పొరబాటు జరిగి అది రాకుమారి చేతబడి వుంటే – ఆ చీటీ ఆమెకు రాశావని ఆగ్రహించి, నీ తల కోట గుమ్మానికి వేలాడదీయించేది. నాన్న నేడో రేపో మనపెళ్ళికి ముహూర్తం పెట్టించే ప్రయత్నంలో వున్నాడు. అయినా, చీటీలో కూడా నా పేరు రాయడానికి అంత సిగ్గా నీకు? ఏమైనా, పల్లె కుర్రాడివనిపించావు!" అని నవ్వుతూ రాకుమారి వుండే అంతఃపురానికేసి పరిగెత్తింది.
మల్లిక మాటలతో కొండయ్యకు తల మీదినుంచి కొండంత బరువు దిగిపోయినట్టయింది. వాడు తేలికపడ్డ మనసుతో, "బుద్ధిమాలి నేరక చేసిన తప్పుకు కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది? నా బోటివాడు తనకు తగ్గ ఆలోచన చేయాలి కానీ, ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. లేనిపోని భయాలతో ఎంత చావు చచ్చాను! మల్లిక అడ్డుకోకపోతే, ఈరోజు నా గతేం కాను? రాకుమారి వద్దనే వద్దు. మల్లికే నాకు తగిన భార్య!" అనుకున్నాడు.
చివరగా మార్పులు చేసినవారు nightlight; నేడు 02:41 PM.