సుల్తాను ప్రశ్నలు

ఒకనొక సుల్తాను, హుస్సేన్ అనే మిత్రుడితో కలిసి అడవి మార్గం గుండా వెళుతున్నాడు. వాళ్ళముందు కొంతదూరంలో మరొక మనిషి నడుస్తున్నాడు. సుల్తాను మిత్రుడితో, “హుస్సేన్! అదిగో, ఆ వెళుతున్న మనిషిని గురించిన వివరాలే వైనాచెప్పగలవా?” అని అడిగాడు ఉత్సాహంగా. హుస్సేన్ వెళుతున్న బాటసారిని కొంత సేపు పరిశీలనగా చూసి, “ప్రభూ! అతడొక వడ్రంగి అయివుంటాడు!” అన్నాడు.
“మరి, అతడి పేరేమిటో చెప్పగలవా?” అని అడిగాడు సుల్తాను.
“బహుశా అతనిపేరుకూడా హుస్సేన్ అయి వుండవచ్చు, ప్రభూ!” అన్నాడు మిత్రుడు.
“అంటే, లోగడే ఆ మనిషి నీకు తెలుసు నన్నమాట! అంతేనా?” అన్నాడు సుల్తాను.
“లేదు ప్రభూ! అతన్ని నేనిప్పుడే చూస్తున్నాను!” అన్నాడు మిత్రుడు.
“మరి, అతని పేరెలా చెప్పగలిగావు?” అని అడిగాడు సుల్తాను ఆశ్చర్యంతో.
“తమరు నన్ను పేరుపెట్టి పిలిచినప్పుడు, ఆ బాటసారి ఇటుకేసి తలతిప్పి చూడడం నేను గమనించాను. అందువల్ల అతనిపేరు కూడా నా పేరే అయివుంటుందని ఊహించాను,” అన్నాడు మిత్రుడు.
“శభాష్! నీ సమాధానం యుక్తియుక్తంగానే ఉన్నది. మరి, అతడు వడ్రంగి అని ఎలా చెప్ప గలిగావు?” అని అడిగాడు సుల్తాను.
“ప్రభూ! అతడు నడుస్తున్నప్పుడు పళ్ళూ, పువ్వులూ నిండిన చెట్లకేసి చూడకుండా, బోదెలు లావుగా ఉన్న ఎత్తయిన చెట్లకేసి అంటే, కలపకు పనికివచ్చే చెట్లకేసి మాత్రమే చూస్తూ వెళ్ళడం గమనించాను. అందువల్ల అతడి వృత్తి వడ్రంగం అయివుంటుందని ఊహించాను!” అని సమాధానమిచ్చాడు మిత్రుడు.
“ఆహా! చాలాగొప్ప పరిశీలన! నువ్వుమహా మేధావివి. నీమేధాసంపత్తిని, పరిశీలనాశక్తినీ పరీక్షించడానికి మరొక ప్రశ్న! ఆ వెళుతున్న వ్యక్తి కొంతసేపటికి ముందు ఏం భుజించాడో చెప్పగలవా?” అని అడిగాడు సుల్తాను.
బాటసారిని కొంతసేపు పరిశీలనగా చూసిన తర్వాతమిత్రుడు, “కొంతసేపటి క్రితం అతడు తేనెగాని, మరేదో తియ్యటి ఫలహారాన్నిగాని భుజించి ఉంటాడు ప్రభూ!” అన్నాడు.
“అలాగా! ఆ విషయం అతన్నే అడుగుదాం!” అంటూ సుల్తాను చప్పట్లు చరిచి బాటసారిని దగ్గరికి పిలిచాడు. అతడు సమీపించగానే సుల్తాను తన మిత్రుణ్ణి చూపి, “ఇతడిని నువ్వుఎరుగుదువా?” అని అడిగాడు.
“ఎరగను,” అన్నాడు బాటసారి.
“మిత్రమా! ఇప్పుడు నేను మూడు ప్రశ్నలడుగుతాను. దాపరికంలేకుండా సమాధానాలు చెప్పగలవా?” అని అడిగాడు సుల్తాను.
“చిత్తం, అలాగే చెబుతాను,” అన్నాడు బాటసారి.
“నీ పేరేమిటి? నీ వృత్తి ఏమిటి? కొంత సేపు క్రితం నువ్వేం భుజించావు?” అనిఅడిగాడు సుల్తాను.
“నా పేరు హుస్సేన్; నేనొక వడ్రంగిని; అరగంట క్రితం స్వచ్ఛమైన తేనె తాగాను,” అన్నాడు బాటసారి.
“నీ సమాధానాలకు చాలా సంతోషించాను,” అంటూ సుల్తాను తన చేతికున్న బంగారుకడియం తీసి బాటసారికి అందించాడు.
బాటసారి దానిని తీసుకుని పరమానందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత సుల్తాను మిత్రుడికేసి తిరిగి, “అతడు తేనె తాగాడని ఎలా గ్రహించావు?” అని అడిగాడు ఆశ్చర్యంగా.
“అతడు మాటిమాటికి పెదవులను చేత్తో తుడుచుకోవడం, నోటి దగ్గరికి వాలుతున్న తేనెటీగలను చేత్తో తరుముతూ ఉండడం చూశాను; కాబట్టి ఏదో తీపి పదార్థం తిని ఉంటాడని ఊహించాను. ఈప్రాంతంలో తేనె పుష్కలంగా లభించడంవల్ల అతడు తేనెతాగి ఉంటాడని గ్రహించాను!” అన్నాడు హుస్సేన్.
“మిత్రమా! నీ పరిశీలనాశక్తి అద్భుతం! నీ మేధాసంపత్తి మహద్భుతం!” అంటూ సుల్తాను మిత్రుణ్ణి ఆనందంతో కౌగిలించుకున్నాడు.