-
పొదుపు రహస్యం
పొదుపు రహస్యం
పడమటి తీరాన గణేశుడూ, గంగాధరుడూ అని ఇద్దరు యువకులుండేవారు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి, చిన్నతనం నుంచీ కలిసి తిరిగారు. వాళ్ళు యుక్తవయస్కులై తమ బతుకుతెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వారుండే ప్రాంతం బొత్తిగా కాటక ప్రాంతమైపోయింది. అందుచేత వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి పెట్టి తూర్పుతీరానికివెళ్ళి, సంపద సమృద్ధిగా ఉండేచోట జీవనోపాధి కలిగించు కుందామనుకున్నారు. “మనిషి పొట్టకెంత కావాలి? ఇంత అన్నమూ, ఎండు చేపలూ తింటూ ఎంత కాలమైనా బతకవచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి సాధ్యమైనంత మిగుల్చుకున్నా మంటే, అది పెట్టుబడిగా ఏ వర్తకం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది,” అన్నాడు గంగాధరుడు. “అలాగే పొదుపుగాజీవించి జీవితంలో పైకివద్దాం,” అన్నాడు గణేశుడు.
ఇద్దరూ ప్రయాణం చేసి తూర్పుతీర ప్రాంతం చేరుకున్నారు. అది సుక్షేత్రం. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పచ్చటి పైరులు కనిపించి, వారి కళ్ళను ఎంతో ఆనందపరిచాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరారు. అక్కడ వర్తకం కూడా బాగా సాగుతున్నది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ చీలిపోయారు. ఒకటి, రెండేళ్ళ పాటు ఎవరి అదృష్టాన్ని వారే వెతుక్కోవటమూ, ఒకరి బరువు ఒకరిమీద వేయకుండా ఉండటమూ మంచిదని వారికి అనిపించింది.
గణేశుడు దొరికిన పని ఏదైనా చేసి, రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు చెప్పినట్టే అతను వరి అన్నమూ, ఎండుచేపలూ తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. కాని గణేశుడు ఎంతోకాలం ఇలా చేయలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించి అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా, నోరు కట్టేసుకోవడం అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఒకనాడు అతను కోడిని కొని, వండుకుని తిన్నాడు. దాంతో అతనికి ప్రాణంలేచి వచ్చినట్టయింది. సుఖంగా తినటానికి కాకపోతే ఎంతో శరీరం కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏమిటి? అయినా, ఒకవంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనస్సు బాధపడింది. అందుచేత అతను మళ్ళీ కొన్నాళ్ళు అన్నవునూ, ఎండుచేపలూ తింటూ గడిపాడు. కాని అది భోజనం లాగానే లేదు. కోడి రుచి అనుక్షణమూ జ్ఞాపకం వచ్చేది. చివరకు గణేశుడి జిహ్వాచాపల్యమే గెలిచింది. అతను తన దగ్గర ఉన్నదంతా రుచిగా తినటానికే ఖర్చు చేయసాగాడు. తిండి సుఖంతో, మిగుల్చుకున్న డబ్బంతా అయిపోవటం అలా ఉంచి, అతనికి పనికి ఒళ్ళు వంగకుండా పోయింది. దీని ఫలితంగా అతను అన్నమూ, ఎండు చేపలూ కొనటానికి కూడా తగినంత సంపాదించుకోలేని స్థితికి వచ్చేశాడు.
ఈలోపల గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి రాగి దమ్మిడీ కూడా ప్రాణంతో సమంగా ఎంచి, తన కష్టార్జితాన్ని కూడబెట్టి, చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి, క్రమంగా పెద్ద వర్తకానికి ఎగబాకి, అందులో త్వరగా పైకి వచ్చి, కొంత ఆస్తి సంపాదించుకుని, ఇల్లు కట్టుకుని, పెళ్ళిచేసుకున్నాడు. తనతో బాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడుగా బతుకుతున్న సంగతి గణేశుడికి తెలుసు. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశ్యంతో అతను గంగాధరుడి ఇంటికి వెళ్ళి, తనకు అదృష్టం కలిసి రాలేదనీ, తనకు పూటకింత అన్నమూ, ఎండుచేపలూ కరువయ్యాయనీ చెప్పాడు. “నీకా అన్నమూ, ఎండుచేపలూ అందేటట్టు నేను చూస్తాను. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు,” అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలో ఒక గుడిసె వేయించి ఇచ్చి, రోజూ బియ్యమూ, ఎండుచేపలూ అతనికి పంపుతూ వచ్చాడు. గణేశుడు వాటితో వంటచేసుకు తింటూవచ్చాడు. కొద్ది రోజులు గడిచాక గంగాధరుడు గణేశుణ్ణి పిలిపించి, “రోజూ ఎండుచేపలు తినటం నీకు చవివచ్చినట్టుగా ఉంటున్నదేమో! ఒక పనిచేయ్యి. నా చింత తోపులో కెల్లా చిన్న చింత మొక్కను నీకు ఇచ్చేస్తాను. దాని ఆకు తెచ్చి, చేపల కూరలో వేసి ఉడకబెట్టావంటే రుచిగా ఉంటుంది. ఆ పని చెయ్యి,” అన్నాడు. గణేశుడు తన మిత్రుడి చింతల తోపుకు వెళ్ళి, అక్కడ ఉన్న మొక్కలలో చిన్న దాని నుంచి ఆకు దూసుకువచ్చి చేపలకూరలో వేశాడు. కూర రుచిగానే ఉన్నది. అయితే కొద్ది రోజులకల్లా చింతమొక్కన ఒక్క ఆకు కూడా లేకుండా పోయింది.
గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి చిన్న మొక్కలో ఆకులు లేకుండా పోయాయని చెప్పి, మరొక చింతచెట్టు నుంచి ఆకు కోయటానికి అనుమతికోరాడు. “ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకీ పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో,” అన్నాడు గంగాధరుడు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుణ్ణి పిలిచి, “నువ్వు, కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు గద,” అన్నాడు. “నేను రోజుకు గుప్పెడు ఆకు కోస్తే ఆ చెట్టున మర్నాటికిరెండు గుప్పెళ్ళు చిగురు పెట్టుకొస్తుంది,” అన్నాడు గణేశుడు. “నువ్వు చేసిన దానికి, నేను చేసినదానికీ అంతే తేడా! నువ్వు నీ ఆర్థికస్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి, దాని నుంచి నాకు కావలసినదంతా అనుభవించ గలుగు తున్నాను. నీ జీవితం మోడుబారి పోయింది. నా జీవితం మూడు పూలూ, ఆరు కాయలుగా ఉన్నది,” అన్నాడు గంగాధరుడు. “అవును! ఇక నేను నీమీద ఆధారపడక, మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను,” అని గణేశుడు తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలుచేయటానికి పూనుకున్నాడు.
చివరగా మార్పులు చేసినవారు nightlight; నేడు 12:29 PM.