-
వింతపక్షి
వింతపక్షి
పర్షియా దేశంలోని షిరాజ్ నగరం గొప్ప వర్తక కేంద్రమేకాక, ముఖ్యమైన యాత్రా స్థలం కూడా. అందువల్ల నగరానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూండేవారు. అలా నగరం చేరేవారు, ఒక అరణ్యం గుండా ప్రయాణం చేయవలసి వుండేది. అక్కడ తరచుగా వాళ్ళకు ఒక వింత పక్షి కనబడుతూండేది. దాన్ని చూసిన వాళ్ళు, ఈనాటి వరకూ అంత అందమైన పక్షిని తాము చూడలేదని అబ్బురపడేవాళ్ళు. ఇక దాని పాట కూడా విన్నవాళ్ళు, దాన్ని గంధర్వగానంతో సరిపోల్చేవాళ్ళు.
ఆ వింతపక్షిని పట్టుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. అలాంటివాళ్ళల్లో, ధనిక కుటుంబాల యువకులే కాక, పొరుగు రాజ్యాల రాకుమారులు కూడా వున్నారు. కానీ, ఆశ్చర్యం కలిగించే సంగతేమంటే, అలా వెళ్ళినవాళ్ళల్లో ఒక్కరూ తిరిగి రాలేదు. అందరూ రాళ్ళుగా మారిపోయారు.
ఈ వింతపక్షిని గురించి విన్న షిరాజ్ రాజు కూతురుకు, దాన్ని తనదిగా చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె తండ్రి అనుమతితో ఒక చాటింపు వేయించింది. అదేమంటే, ఆ వింతపక్షిని పట్టితెచ్చిన వాడిని తాను వివాహమాడుతుంది. నగరంలో ధనిక కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులున్నారు. వాళ్ళు బాల్యమిత్రులు. వాళ్ళల్లో ఒకడు వింతపక్షిని పట్టి తెచ్చి, రాకుమారిని వివాహమాడేందుకు అరణ్యానికి వెళ్ళాడు.అరణ్యంలో ఆ పక్షి ఏ ప్రాంతాల తిరుగుతూండేదీ, వాడు ప్రయాణీకుల ద్వారా తెలుసుకుని, వెతుకుతూ, ఒకనాటి మిట్టమధ్యాహ్నం వేళ, దాన్ని ఒక చెట్టు కొమ్మ పైన చూశాడు. వాడు దాన్ని పట్టుకునేందుకు, చెట్టును సమీపించేంతలో, పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. ఆ పాట విని తన్మయుడై వాడు కూడా గొంతెత్తి, దాన్ని అనుకరించబోయాడు. ఆ మరుక్షణం వాడు ఉన్న చోటునే రాయిగా మారిపోయాడు.
ఒక నెల గడిచింది. ముగ్గురు మిత్రుల్లో రెండవవాడు, పక్షి కోసం బయలుదేరాడు. వాడికి రాకుమారైను పెళ్ళాడాలన్న కోర్కెవున్నది. కానీ వాడూ తిరిగి రాలేదు. రెండు నెలలు గడిచిపోయినై.
మిత్రుల్లో మూడవవాడైన హనీఫ్ అరణ్యానికి బయలుదేరాడు. వాడు, తనను వెళ్ళవద్దని వారించ చూసిన వాళ్ళతో, "నాకు ఆ వింతపక్షిని పట్టుకోవాలనిగానీ, రాకుమార్తెను వివాహమాడాలనిగానీ లేదు. నా ఇద్దరు మిత్రులూ ఏమయ్యారో తెలుసుకునేందుకు పోతున్నాను. సాధ్యమైతే, వాళ్ళను రక్షించి తీసుకువస్తాను," అన్నాడు.
హనీఫ్ కు అరణ్యంలో ఒకచోట వింత పక్షి కనబడింది. అది వాణ్ణి చూస్తూనే గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగింది. హనీఫ్ దాని పాట విని ముగ్ధుడైపోయి, తానూ పాడాలనుకున్నాడు. కానీ, ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుని, దాన్ని సమీపించాడు. పక్షి పాట ఆపి, హనీఫ్ కేసి చూసింది. హనీఫ్ దాన్ని ఉపాయంగా పట్టుకున్నాడు. హనీఫ్ ఆప్యాయంగా వింతపక్షి తల నిమురుతూ, "నీది అద్భుతమైన అందం! ప్రపంచంలో నీలాంటి పక్షి మరొకటి వుండదు. నా మిత్రులిద్దరికీ తిరిగి ప్రాణదానం చేయలేవా?" అని అడిగాడు. పక్షి తలాడించి, "సరే, నీ కోర్కె నెరవేరుస్తాను. రాళ్ళుగా వున్న నీ మిత్రులపైన నన్ను ఎగరనివ్వు," అన్నది. హనీఫ్ పక్షిని విడిచాడు. అది రాళ్ళ రూపంలో వున్న హనీఫ్ మిత్రుల మీద వలయాకారంలో రెండుసార్లు ఎగిరింది. వెంటనే మిత్రులిద్దరికీ యథారూపాలు వచ్చినై. ఈసారి హనీఫ్ పక్షితో, "నీ అందం చూసి, నిన్ను పట్టుకోవాలని యింకా కొందరు కూడా యిక్కడికి వచ్చి, రాళ్ళుగా మారిపోయారు. వాళ్ళనూ తిరిగి మనుషులుగా చెయ్యి," అన్నాడు.
వింతపక్షి రాళ్ళ రూపంలో వున్న వాళ్ళ మీదుగా, తిరిగి వలయాకారంలో రెండుసార్లు ఎగిరింది. ఆ మరుక్షణం, రాళ్ళుగా మారిపోయిన వాళ్ళందరికీ మానవరూపాలు వచ్చినై. వాళ్ళు హనీఫ్ కు తమ కృతజ్ఞత చెప్పుకుని, తమ తమ ప్రాంతాలకు బయలుదేరి పోయారు. హనీఫ్ పక్షితో, "నీ మేలు ఎన్నటికీ మరవను. నువ్వు, నాతోపాటు నగరానికి రాకూడదా?" అన్నాడు.
"ఎందుకు రాను!" అంటూ పక్షి ఎంతో మృదువుగా జవాబు పలికింది. వెంటనే హనీఫ్ తన వెంట తెచ్చిన పంజరం తలుపు తెరిచాడు.
పక్షి అతడితో, "నా ఎడమ కాలికీ వున్న ఉంగరాన్ని చూశావా! దాన్ని తీసుకుని, నీ వేలికి పెట్టుకో. అది ముందు, ముందు నీకెంతో మేలుచేయగలదు," అని చెప్పి, పంజరంలోకి వెళ్ళింది. హనీఫ్, దాని కాలి ఉంగరం తీసుకుని తన వేలికి పెట్టుకున్నాడు. తరువాత ముగ్గురు మిత్రులూ నగరానికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ముగ్గురూ ఆ రాత్రికి అరణ్యంలోనే ఒక చెట్టు కింద పడుకున్నారు. ఒక అర్ధరాత్రివేళ హనీఫ్ మంచి నిద్రలో వుండగా, దుష్టులైన అతడి మిత్రులిద్దరూ కూడబలుక్కుని, హనీఫ్ కాళ్ళూ, చేతులూ బంధించి, దాపుల వున్న ఒక పాడుబడిన బావిలో పడవేశారు. అదృష్టవశాత్తూ, అందులో నీళ్ళు లేవు; మెత్తని ఇసుక పేరుకుని వున్నది. హనీఫ్ కు దెబ్బలు తగలలేదు గాని, పడినపాటుకు మూర్ఛపోయాడు. పావుగంట తరువాత హనీఫ్ కు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు. అతడి పక్కన నల్లగా వున్న భూతం ఒకటి కూర్చుని వున్నది. హనీఫ్ ఒక్క క్షణకాలం భయకంపితుడై, అంతలోనే తేరుకుని, "ఎవరు నువ్వు?" అని భూతాన్ని అడిగాడు. "నేను, నీ వేలికి వున్న ఉంగరంలోని భూతాన్ని. నువ్వు బావిలో పడుతున్నప్పుడు, ఉంగరం బావిరాళ్ళకు గీసుకున్నది. అందువల్ల నేను ప్రత్యక్షమయ్యాను. నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను," అన్నది నల్లభూతం. "నన్ను బావిలోంచి పైకి తీసుకుపో," అన్నాడు హనీఫ్. వెంటనే భూతం అతణ్ణి బావిలోంచి బయటికి తెచ్చింది. హనీఫ్, భూతంతో, "నేను వెంటనే నగరం చేరాలి. స్వారీ చేసేందుకు గుర్రంగా మారు," అన్నాడు. నల్లభూతం గుర్రంగా మారి, హనీఫ్ ను నగరం చేర్చింది. ఆ సమయాన రాజభవనంలో వేడుకలు జరుగుతున్నవి. అందుకు కారణం, రాకుమారికి వింత పక్షి బహూకరణ జరగడం. అయితే, రాజభవనం ముందు హనీఫ్ మిత్రులిద్దరూ పోట్లాడుకుంటున్నారు. వాళ్ళు రాజుతో ఆ పక్షిని నేను పట్టుకున్నానంటే నేనని చెబుతున్నారు. రాజుకు ఏం చేయాలో పాలుబోవటం లేదు. హనీఫ్, రాజును సమీపించి, "ప్రభూ, ఆ పక్షినే అడగండి. నిజం తెలిసిపోతుంది," అన్నాడు. హనీఫ్ ను చూసి, అతడి దుష్ట స్నేహితులిద్దరూ నిలువెల్లా వణికిపోసాగారు. "ఆ పక్షి మాట్లాడడం లేదు. అదీ వచ్చిన చిక్కు," అన్నాడు రాజు చిరాకుగా. "ఆ పక్షిని, నా దగ్గరకు తెప్పించండి. తప్పక మాట్లాడుతుంది," అన్నాడు హనీఫ్. రాకుమారి మందిరం నుంచి పక్షిని తీసుకువచ్చారు. హనీఫ్, దానితో, "అరణ్యంలో నిన్నెవరు పట్టుకున్నారో, నిజం చెప్పు !" అన్నాడు. "పంజరంలో వున్న వింతపక్షి వెంటనే, 'నాకు స్వేచ్ఛ యివ్వండి. పంజరంలో వుండగా నేను ఏ ప్రశ్నకూ జవాబు చెప్పను,' అన్నది. వింత పక్షిని పంజరం నుంచి వదలడానికి రాకుమార్తె అనుమతి కోరారు. నిజంగా దాన్నిఎవరైతే పట్టితెచ్చారో, అతణ్ణే ఆమె పెళ్ళాడవలసి వున్నది. అందువల్ల, రాకుమార్తె పక్షి కోరినట్టుగా, దాన్ని పంజరంనుంచి వదలడానికి ఒప్పుకున్నది. నౌకరు పంజరం తలుపు తెరవగానే, వింతపక్షి ఎగిరి హనీఫ్ భుజం మీద కూర్చుని, 'నన్ను అరణ్యంలో పట్టుకున్నది నువ్వే! నువ్వే!' అంటూ రెండుసార్లు పలికింది. పక్షి అలా అనగానే హనీఫ్ మిత్రులిద్దరూ అక్కడణ్ణించి పారిపోజూశారు. కానీ, రాజుగారి భటులు వాళ్ళను తరిమి పట్టుకున్నారు. రాజు వాళ్ళకేసి పళ్ళు కొరుకుతూ చూసి, 'ఈ దుర్మార్గుల తలలు నరకండి!' అంటూ భటులకు ఆజ్ఞ యిచ్చాడు. హనీఫ్ రాజుతో, 'ప్రభూ, వీళ్ళను క్షమించి వదలండి. అరణ్యంలో బండరాళ్ళుగా పడివున్న వీళ్ళకు, నేను ప్రాణదానం చేశాను. వాళ్ళ దుర్మరణం నాకు బాధ కలిగిస్తుంది,' అన్నాడు. హనీఫ్ యిలా కోరగానే, రాజు, ఆ ఇద్దరు దుష్టుల్నీ విడిచిపుచ్చవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. వింతపక్షి హనీఫ్ భుజం మీది నుంచి రెక్కలల్లాడించి లేచి, అరణ్యంకేసి రివ్వున ఎగిరిపోయింది. రాకుమార్తెతో హనీఫ్ వివాహం వైభవంగా జరిగింది. ఆ తరువాత అతడూ, రాకుమార్తె సంవత్సరానికి ఒకసారి వింతపక్షిని చూసేందుకు అరణ్యానికి వెళ్ళేవాళ్ళు. అయితే, ఆ పక్షి శ్రావ్యంగా పాడడం మొదలు పెట్టాక, ఆనందంకొద్దీ దానితోపాటు పాడకుండా తగు జాగ్రత్తలో వుండేవాళ్ళు.
చివరగా మార్పులు చేసినవారు nightlight; 17-06-2026 05:46 PM.