-
తెలివితక్కువ దద్దమ్మ
తెలివితక్కువ దద్దమ్మ
సింగారపురంలో సుక్కు, రుక్కు అని ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు. సుక్కు చాలా తెలివైనవాడు. వాడు తనకు చేతనైన విద్యలు అన్ని రుక్కుకు నేర్పాడు. రుక్కు విద్యలైతే నేర్చాడు గాని, వాటిని సమయం తెలిసి ప్రయోగించే నేర్పు లేదు. అందుకని సుక్కు వాడితో “అబ్బాయీ! నీ అంతట నీవు స్వతంత్రించి ఏపనీ చేయబోక. నేనేమి చేస్తానో కనిపెట్టి చూస్తూవుండు. అలానే నువ్వు చేస్తూవుండు” అని చెప్పాడు. సరేనని ఒప్పుకున్నాడు రుక్కు. ఒకరోజున వాళ్ళు, లక్షాధికారి అయినటువంటి సుబ్బిశెట్టి ఇంట్లో కన్నం వేయటానికిని వెళ్ళారు. సుక్కు కన్నం వేశాడు. వాడూ రుక్కూ కలిసి నడీ చప్పుడూ చేయకుండా లోపలికి దూరారు. మెల్లిగా ధనాగారంలోకి ప్రవేశించారు. సుక్కు ధనద్రవ్యాలూ, వస్తువాహనాలూ ఉండే పెద్ద పెట్టె తెరిచాడు. ధనం కాజేస్తూ ఉండగా పొరపాటున చెయ్యితగిలి పెట్టెమూత దభీమనిపడి చప్పుడయింది. ఆ చప్పుడుకు సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. పడుకొని ఉండే ‘ఎవడురా అక్కడ !!’అని కేక వేశాడు. ఆ వెంటనే సుక్కు ‘మ్యావ్! మ్యావ్!!’ అని కూశాడు. ‘సరే పిల్లి కాబోలు చప్పుడు చేసింది’ అని అనుకొని సుబ్బిశెట్టి అటుపక్కకు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. ఈసారి రుక్కు అక్కడికు వెళ్ళి పెట్టె తీయబోయాడు. దురదృష్టవశాత్తు అది వాడి కాలుకు తగిలి బోర్లాపడ్డాడు. పెద్దగా చప్పుడయింది. శెట్టి లేచాడు. ‘ఎవడురా అక్కడ !!’ అని కేకలేస్తూ ఆ గదిలోకి వచ్చాడు. శెట్టిని చూచి రుక్కు కంగారు పడ్డాడు. వణికిపోతూ చేతులుకట్టుకొని ‘నేను రెండోపిల్లినండి, క్షమించండి బాబూ! ఏమీ అనకండి’ అని బతిమాల సాగాడు. అప్పుడు శెట్టి గదిలో దూరిన రెండు పిల్లుల్నీ పట్టి కట్టి కొట్టి వదిలాడు.
చివరగా మార్పులు చేసినవారు nightlight; 07-06-2026 01:25 PM.