అదీ సంగతి!
లక్ష్మీపతి, గౌరీపతి ఇరుగుపొరుగు గృహస్థులు. లక్ష్మీపతి శ్రీమంతుడు. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా సాగే జీవితం అతనిది. గౌరీపతి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైనది. అతడిది కుచేల సంసారం. పైగా, ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటాడు. కానీ, ఎన్ని ఇబ్బందులున్నా, అప్పో సప్పో చేసి తన పుట్టినరోజును మాత్రం సంతోషంగా జరుపుకుంటాడు. తెలిసినవాళ్ళందరి ీ ఆ రోజున స్వయంగా మిఠాయికూడా పంచి పెడతాడు. ఒకసారి గౌరీపతి, తన పుట్టినరోజున మిఠాయిలు పంచుతుండగా, అతడున్న వీధిలోనే ఉండే రామరాజు ఎదురుపడి, “గౌరీపతీ, నాదొక చిన్న సందేహం. అడిగితే ఏం అనుకోవుగదా?” అన్నాడు. “అడగండి!” అన్నాడు గౌరీపతి. “మీ పొరుగుంటి లక్ష్మీపతికి ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ వున్నాయి. అయినా, ఆయన ఎన్నడూ తన పుట్టినరోజును జరుపుకున్నట్లు, నే వినలేదు. మరి నీదేమో ఒక రకంగా కష్టమయ జీవితం. అయినా, ఏమరకండా ప్రతి సంవత్సరం పుట్టినరోజును సంతోషంగా జరుపుకుంటావు. ఇది నాకు చాలా విడ్డూరంగా వుంది,” అన్నాడు రామరాజు. ఆ ప్రశ్నకు గౌరీపతి చిన్నగా నవ్వి, “ఇందులో విడ్డూరం ఏముంది! హాయిగా సాగిపోతున్న తన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది కదా అన్న విచారంతో, లక్ష్మీపతి తన పుట్టినరోజు జరుపుకోడు. ఇక నేనో – బాధలు నిండిన బతుకులో, ఒక సంవత్సరం తగ్గిందికదా అనే ఆనందంతో, పుట్టినరోజు పండుగ చేసుకుంటాను, అదీ సంగతి!” అన్నాడు.


వ్యాఖ్యతో ప్రత్యుత్తరం