విధేయత
వేళ్ళచింతలగూడెం లో నివసించే ధనికుడైన పరంధామయ్యకు, తోటమాలి ఒకడు అవసరమై, తన మిత్రుడితో చెప్పాడు.
అతడు శివయ్య, రామయ్య అనే ఇద్దరు కూలీవాళ్ళను పంపుతూ, నచ్చిన వాడెవడికో ఒకడికి పని ఇవ్వమన్నాడు. పరంధామయ్య, ఆ ఇద్దర్నీ ఉదయమే తోటలోకి తీసుకుపోయి, "సాయంత్రం వరకూ పని చేయండి. నచ్చినవాణ్ణి పనిలోకి తీసుకుంటాను," అని చెప్పి వెళ్ళిపోయాడు.
మిట్టమధ్యాహ్నం ఎండ ఫెళఫెళలాడే సమయంలో, పరంధామయ్య కూలీలను చూడవచ్చాడు. యజమాని రావడం చూసిన శివయ్య, ఒక్క ఉదుటున వచ్చి ఆయనకు కుర్చీవేసి, మంచినీళ్ళు అందించి, విసనకర్రతో విసరసాగాడు. పరంధామయ్య, రామయ్యను పిలిచి, "నేను వచ్చి ఇంతసేపయినా, నువ్వు నన్ను పట్టించుకోనేలేదు. యజమాని పట్ల ఇది అవిధేయత కాదా?" అన్నాడు గద్దిస్తూ. రామయ్య చేతులు నలుపుకుంటూ, "అయ్యా! క్షమించండి. పనిలోపడి మిమ్మల్ని చూడనే లేదు," అన్నాడు.పరంధామయ్య, కూలీలిద్దరికీ మరికొన్ని పనులు పురమాయించి వెళ్ళిపోయాడు.
మర్నాడు ఆయన ఇద్దర్నీ పిలిచి, రామయ్యను పనిలోకి తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇందుకు శివయ్య, "అయ్యా! నిన్న మీరు వచ్చినప్పుడు ఎన్నో సపర్యలు చేశాను. అటువంటి నన్ను వదిలి, అహంకారంతో మిమ్మల్ని లక్ష్యపెట్టని రామయ్యకు పని ఇవ్వడం ఏం న్యాయం!" అన్నాడు బాధగా. అందుకు పరంధామయ్య, "నీకు పనిపట్ల ఏకాగ్రత లేదు. రామయ్య నన్ను గౌరవించకపోయినా తన పనిని గౌరవించాడు.పనివాడ తన పని పట్ల శ్రద్ధ కలిగివుండడమే, యజమాని పట్ల చూపించే నిజమైన విధేయత!" అన్నాడు.


వ్యాఖ్యతో ప్రత్యుత్తరం