-
మహా శివరాత్రి
శివరాత్రి యొక్క ప్రాశస్త్యం గురించి లింగ, శివ పురాణాల్లో చకట్టి కధ ఒకటి ఉంది. సృష్టి ఆరంభ సమయంలో విశ్వమంతా శూన్యంతో నిండి ఉండేది. నిజానికి అసలు విశ్వమే లేదు. అంతటా పరబ్రహ్మం నిండి ఉంది. ఆ బ్రహ్మ పదార్ధానికి చలి, వేడిములు తెలియవు, ఆది మరియు అంతములు లేవు. శూన్యమంతా నీటితో నిండి ఉన్న ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ నీటిపై యోగనిద్రలో ఉండగా, అతని బొడ్డు నుంచి ఒక పద్మం ఉద్భవించింది. అనేక రేకులు కలిగిన ఆ కలువ పుష్పానికున్న కాడ వేల సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. ఆ పద్మం యొక్క కణాల నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి చుట్టూ పద్మం తప్ప ఏమి కనిపించడంలేదు. దాంతో "నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమి చేయాలి? నేను ఎవరి పుత్రుడిని? నన్నెవరు సృష్టించారు?" అంటూ ప్రశ్నలు వేసుకుంటూ, ఆ కలువపూవ్వు మొత్తం తన ఉనికిని గురించి తెలుసుకునేందుకు వెతకసాగాడు.
తన ఉనికి తెలుస్తుందేమోనని ఆ పద్మం యొక్క మధ్యభాగాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడు. ఆఖరున ఆ పద్మం యొక్క కాడ ద్వారా క్రిందకు దిగి, ఆ పద్మం చుట్టు తిరుగుతూ ఒక 100 ఏళ్ళు గడిపాడు. కానీ దానికి యొక్క మధ్యభాగం కనబడలేదు. తను ఏ కణం నుంచైతే పుట్టాడొ, ఆ కణం దగ్గరకే వెళితే తన ఉనికి తెలుసుకోవచ్చని, ఆ ప్రదేశాన్ని వెతకడంలో మరో వంద ఏళ్ళు తిరిగినా, సమాధానం దొరకక అలసిపోయాడు, విశ్రాంతి తిసుకుంటున్నాడు.
ఇంతలో ఓ బ్రహ్మ! తపస్సు ఆచరించు అన్న మాటలు వినపడగా, 12 ఏళ్ళు తపస్సు చేయగా, శ్రీ మహా విష్ణువు నాలుగు భుజములతో, శంఖు, చక్ర, గదా, పద్మాలను ధరించి దర్శనమిచ్చాడు. బ్రహ్మ విష్ణువును నువ్వెవరు అని అడుగుతాడు.దానికి, శ్రీ మన్నారాయణుడు 'ఓ పుత్రా! నిన్ను శ్రీ మహావిష్ణువు సృష్టించాడు' అంటూ పరోక్షంగా తన ఎవరో చెప్తాడు.
బ్రహ్మ విష్ణువుతో 'నన్ను నీ పుత్రుడంటున్నావు? ఈ సమస్త జగత్తుకు నేనే విధాతను' అంటూ వాదించాడు. నన్ను నీ పుత్రుడు అనడానికి నీకేం అధికారం ఉంది? అంటూ ప్రశ్నించగా, నన్ను గుర్తించలేదా, నేను నీ తండ్రిని, శ్రీ మహా విష్ణువును అంటూ శ్రీ మన్నారాయణుడు జవాబిస్తాడు. అది అంగీకరించని బ్రహ్మ, విష్ణువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త, అస్త్ర శస్త్రాలు ప్రయోగించుకునే వరకు చేరుతుంది.
బ్రహ్మ విష్ణువుతో పోరాటం చేయడం అంతా విష్ణుమాయ. విష్ణుమాయ చేత కప్పబడ్డాడు కనుక బ్రహ్మదెవునకు ఏమి గుర్తు రావడం లేదు. ఇద్దరు యుద్ధంలో మునిగియున్న సమయంలో కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో, పెళపెళ శబ్దం చేసుకుంటూ మహాతేజో లింగం ఒకటి ప్రత్యక్షమైంది. దానికి ఆది, అంతాలు లేవు. అది అలా వేగంగా పెరుగుతూనే ఉంది. అది అవ్యక్త రూపం. సమస్త విశ్వానికి మూలమైనది. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రమూ, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రమూ ఆ మహాకాంతి స్థంభంలో కలిసిపోయాయి.
ఆ లింగాన్ని చూసిన విష్ణువు మోహితుడయ్యాడు. బ్రహ్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ లింగం నుండి 'మీ ఇద్దరిలో ఈ లింగం యొక్క ఆదిని కాని, అంతమును కానీ, ఎవరు తెలుకుని, ముందు ఈ ప్రదేశానికి చేరుకుంటారో వారే గొప్పవారు' అని మాటలు వినిపించగా, అప్పుడు విష్ణువు బ్రహ్మతో 'ఈ యుద్ధం ఇక్కడితో చాలిద్దాం. ఇప్పుడు మనమిద్దరం కాకుండా మూడవ శక్తి ఇక్కడ ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం' అని చెప్పాడు. 'బ్రహ్మ! నువ్వు హంస రూపంలో ఈ లింగం యొక్క పై భాగాన్ని తెలుసుకునే ప్రయతనం చేయ్యి, నేను వరాహ రూపంలో ఈ లింగం యొక్క క్రింది భాగాన్ని, ఆరంభ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను' అన్నాడు విష్ణువు. ఇద్దరూ వారివారి నిర్దేశిత రూపాల్లో అన్వేషణ ప్రారంభించారు.
విష్ణువు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు పయనించినా, ఆ లింగం యొక్క ప్రారంభ స్థానం కనుగొనలేకపోయాడు. ఎంత క్రిందకు వెళ్ళినా, ఆ లింగం యొక్క మూలం ఇంకా దొరకడంలేదు. తనకు ఇది సాధ్యం కాదని శ్రీమన్నారయణుడు, యుద్ధం జరిగిన ప్రదేశానికి చేరుకుంటాడు.
బ్రహ్మదేవుడు ఎంతో కాలం పైకి ప్రయాణించినా, ఆ లింగం పైభాగం అంతుబట్టడం లేదు. అది ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో బ్రహ్మకు అర్ధం కావడంలేదు. తన అధిపత్యాన్ని నిరూపించుకోవాలని, విష్ణువుకంటే తనకే అధిక గౌరవం దక్కాలని బ్రహ్మ భావించాడు. ఇంతలొ పై నుంచి కేతకీ పుష్పం క్రిదకు వస్తోంది. ఆ పుష్పాన్ని ఆపి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావని అడుగుతాడు బ్రహ్మదేవుడు. నేను ఈ మహాలింగాన్ని అర్చింది క్రిందకు వస్తున్నా అంటుంది, అయితే నీకు దీని అగ్రభాగం తెలుసా? నువ్వు చూశావా? అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. చూశానండీ! కానీ ఈ లింగం పెరిగిపోతూనే ఉన్నది. నేను దీను అగ్రభాగాన్ని తాకి, కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి క్రిందకు పడుతూనే ఉన్నాను. ఈ లింగం చాలా పెద్దది. ఇది ఇప్పటికి ఇంకా పెరిగిపోయి ఉంటుంది. దీని అగ్రభాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటుంది కేతకీ పుష్పం.
చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 27-02-2014 01:09 PM.
-
కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. అహంకార మమకారాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ, తన ఆధిపత్యం కోసం 'తాను లింగం యొక్క పైభాగాన్ని చూసినట్ట్లుగా దొంగసాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధం చెప్పడం పాపం అంటుంది మొగలి పువ్వు. తాను సృష్టికర్తను, తన ఆదేశాలనీ పాటించితీరవలసింద అన్నాడు బ్రహ్మ. చేసేది లేక అసత్యపు సాక్ష్యానికి కేతకీ పుష్పం ఒప్పుకుంది. ఇంతలో ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లిం ాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.
తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?
అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం. వేంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. అంతట బ్రహ్మను వదిలేశాడు వీరభధ్రుడు.
అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజిమపబడని అని శపించాడు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు.
శివుడు కామధేనువు వైపు చూస్తూ కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. "ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.
నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళిద్దరు అనడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.
అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.
బ్రహ్మ మురారి సురార్చిత లింగంనిర్మల బాసిత శోభిత లింగంజన్మజ దుఖః వినాశక లింగంతత్ప్రణమామి సదా శివలింగం
ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము అని పలికెను. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.
ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.
ఓం నమః శివాయ
Eco Ganesh గారి సౌజన్యంతో.