ఫలితాలు 1 నుండి 1 వరకు 1 లో

అంశం: క్షమాగుణం

  1. #1

    క్షమాగుణం

    క్షమించడం ఒక గొప్ప లక్షణం. మాటమాట పెరగకుండా, మనమే ఒక అడుగు ముందుకేసి, వాదనను, యుద్ధాన్ని నివారించడం, ఆపడం అనేది అందరికి సాధ్యం కాదు. ఎవరు ఎక్కువగా వాదిస్తారో, ఎక్కువగా పోరాడతారో, వారే గోప్పవారననేది సమాజం యొక్క భావన. కానీ శక్తి ఉండీ, వెనక్కు తగ్గడం అనేది చాలా కష్టతరమైన పని. అది ధీరులు మాత్రమే చేయగలరు. ఉదాహరణకు మీకు బాగా కోపం వచ్చిందనుకోండి, ఎదుటివాడిని చెంప పగిలేలా కొట్టే పరిస్థితి వస్తే, అక్కడ మీరు, మిమ్మల్ని నియంత్రించుకోవడా ికి, శాంతపడడానికి, వెనక్కు తగ్గడానికి బోలెడు శక్తి కావాలి. కొట్టడం ఎంత సేపు చెప్పండి. అది గొప్ప కాదు. నిగ్రహించుకోవడం గొప్ప. ఇలా నిగ్రహించుకోవడం, అవతలవారిని క్షమించడం వల్లే సంకల్ప శక్తి పెరుగుతుంది. ఇటువంటి క్షమాగుణం జ్ఞానుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎదుటివాడు పాపం అమాయకుడు, అజ్ఞాని, పసిపిల్లవాడు లాంటివాడని జ్ఞాని మనస్పూర్తిగా క్షమించగలుగుతాడు.

    క్షమించడం, క్షమా గుణం కలిగి ఉండడం ధర్మం యొక్క రెండవ లక్షణం. క్షమించడం అన్నమాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒకడు బలహీనుడై, ఎదుటివాడు బలవంతుడైనప్పుడు, వాడితో పోరాటం చేయలేక, వాడు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా, వాడిని క్షమించేస్తాం. ఇది పరికితనంతో చేసే పని. ఇది క్షమా గుణం కాదు, చేతకానీతనం అంటుంది ధర్మం. ఏలా అంటే, మీకు ఎవరి మీదో బాగా కోపం వచ్చింది, గట్టిగా నాలుగు తగించాలనుకున్నారు, కానీ అవతలివాడు మీకంటే శక్తివంతుడని, మీరు ఒక్క దెబ్బ కొడితే, వాడు పది దెబ్బలేస్తాడని తెలిసు కనుక, మీరు వెనక్కు తగ్గుతారు. అది కాదు క్షమా అని అంటుంది ధర్మం.

    మీరు ముందు బలవంతువులుగా మారండి. ఎవరైనా మీ జోలికి వస్తే వాడికి బుద్ధి చెప్పేటంతగా, శారీరికంగానూ, మానసికంగా బలవంతులవ్వాలి. ఎదుటివాడిని మట్టి కరిపించే శక్తి మీకు ఉండాలి. అన్నీ ఉండి, అవతలవాడు బలహీనుడని తెలిసి కూడా మీరు క్షమించగలగాలి. అదే నిజమైన క్షమా గుణం. ఇదే కర్మయోగం చెప్తుంది. ధర్మం కూడా అటువంటి క్షమాగుణాన్నే అలవరచుకోవాలని చెప్తున్నది. ఎందుకంటే ఏమి లేనీవాడు, శక్తిహీనుడు ఎలాగో వాదన చేయలేడు, కనుక సర్దుకుపోతాడు. క్షమించడం ధీరుల లక్షణం. చేతగానితనం బలహీనుల లక్షణం. అందుకే బలహీనులు ఎప్పటికి క్షమించలేరు, క్షమించడం బలవంతుల సద్గుణం అన్నారు గాంధీ.


    క్షమించడం అన్నది కేవలం మాటలకే పరిమితం అవ్వకూడదు. త్రికరణశుద్ధిగా క్షమించాలి. అంటే మనసులోనూ, మాటలలోనూ, చేతలలోనూ క్షమా గుణం కనిపించాలి. ఒకడి మీద మనసులో బోలెడు కోపం, కసి, పగ, ద్వేషం వున్నా, అందరూ చూస్తున్నారనీ, అందరి ముందు ఇవి ప్రదర్శిస్తే, చెడ్డపేరు వస్తుందని, బయటకు 'వాడిని నేను క్షమించేసానండీ!' అని సులువుగా అనేస్తారు. కానీ మీకు తెలుసు, మీ మనసులో వాడి మీద కోపం ఉన్నదని, వాడి మీద కసి తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నారనీ. లేదా, తగిన సమయం కాదు కాబట్టి, తాత్కాలికంగా క్షమిస్తారు. అది నిజంగా క్షమించడం ఎలా అవుతుంది? అది కేవలం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. మీ మనసులో మీ శత్రువు పట్ల విపరీతమైన ద్వేషాన్నీ వేళ్ళతో సహ తొలగించడమే నిజమైన క్షమ. ఇటువంటి నిజమైన క్షమాగుణమే ధార్మికులకు ఉండవలసిన లక్షణం. ఇది ఒక్క రోజులో రాకపోవచ్చు. కానీ సాధన చేత, ధర్మాన్ని తెలుసుకోవడం వల్ల మెల్లమెల్లగా అలవడుతుంది.

    కనుక ప్రయత్నించండి...
    చివరగా మార్పులు చేసినవారు Telugabbayi; 13-02-2014 10:06 PM.