-
భట్టు చమత్కారం
భట్టు చమత్కారం
ఒకానొక రాజుగారి కొలువులో, నారాయణభట్టు అనే విదూషకుడుండేవాడు. ఆయన ఎంతో సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో సభికులనూ, రాజుగారినీ ఆనందపరుస్తూండేవాడు. ఆయనకు కోటగోడ దాపుల రాజుగారు ఒక చక్కని ఇంటిని బహుకరించాడు. ఆ ఇంట్లో నారాయణభట్టు, ఇరుగుపొరుగుల బాధలేకుండా చాలాకాలం హాయిగా జీవించాడు. అయితే, ఆమధ్య బాహుబలుడనే మల్లుడు, నారాయణభట్టు ఇంటి పక్కనవున్న ఇల్లోకటి కొని, అందులో ప్రవేశించాడు. దానితో ఆయనకు రాత్రివేళ సరైన నిద్ర అంటూ లేకుండా పోయింది. దీనికి కారణం మల్లుడు పెంచుతున్న కాపలాకుక్క. అది రాత్రివేళ పెద్దగా మొరుగుతూ, కర్ణకఠోరంగా అరుస్తూ నారాయణభట్టుకు నిద్రాభంగం కలిగించ సాగింది. కొద్ది రోజులు ఆ బాధ భరించిన నారాయణభట్టు, ఒకనాడు మల్లుడితో సంగతి చెప్పి రాత్రివేళ కుక్క అరవకుండా కట్టుదిట్టం చెయ్యమన్నాడు. ఇందుకు మల్లుడు పెద్దగా నవ్వి, “నేను పెంచుతున్నది కాపలాకుక్క. అది దొంగలను ఈచుట్టుపక్కలకురాకుండా చేస్తున్నది. ఇందువల్ల, నీకూ మేలే కదా!” అన్నాడు. “మేలు సంగతి దేవుడెరుగు. నాకు రాత్రిళ్ళు నిద్ర కాదు గదా, కునుకు కూడా పట్టడం లేదు. నీ కుక్క రాత్రివేళ కొత్తవాళ్ళనూ, దొంగలనూ చూసినప్పుడే మొరిగేలా శిక్షణ ఇవ్వు. అలా చేయకపోయావో దాని నోరు మూయించేందుకు నేను గట్టి ప్రయత్నం చేయబోతున్నాను,” అన్నాడు నారాయణభట్టు.
ఆ మాటలకు మల్లుడు వెటకారంగా నవ్వి, “నేను పెంచుతున్నది మామూలు కాపలాకుక్క అనుకునేవు, అది వేటకుక్క జాతిది. అందుకే దాన్ని రాత్రీ పగలూ కూడా ఇంటి ముందున్న కొయ్యగుంజకు కట్టేస్తున్నాను. అది మనిషినే కాదు, సింహాన్నయినా సమీపానికి వస్తే పీకపట్టేస్తుంది,” అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నారాయణభట్టు నాలుగైదు రాత్రులు కుక్కఅరుపులు భరించి, ఇక ఇది పనికాదని కర్ర ఒకటి తీసుకుని, రాత్రి అది అరవడం మొదలుపెట్టగానే దాన్ని సమీపించి, కర్రతో దానినడుంమీద గట్టిగా కొట్టాడు.
ఆ దెబ్బకు కుక్క మరింత పెద్దగా అరుస్తూ, మెడతాడును తెంచుకుని పారిపోయేందుకు గుంజుకుంటూ గంతులేయసాగింది. దాని అరుపులకు మల్లుడు తలుపు తెరుచుకుని బయటికి వస్తూనే, “ఆహాఁ, ఎన్నాళ్ళకు నా కాపలాకుక్క దొంగను పట్టిచ్చింది!” అంటూ నారాయణభట్టుకేసి ఉరకబోయాడు. “ఆగు! ఆగు! నేను దొంగను కాదు, నారాయణభట్టు! నీ కుక్కకు ఎవర్ని చూసి మొరగాలో, ఎప్పుడుమొరగాలో నేర్పేందుకు, ఇప్పుడే నడుంమీద కర్రతోకొట్టాను,” అన్నాడు భట్టు. అది వింటూనే మల్లుడు ఉగ్రుడైపోతూ, “నా పెంపుడు కుక్కను కర్రతో కొట్టడమా? నేను సహించేది లేదు!” అన్నాడు. “నేను నీ కుక్క అరుపులకు నిద్రపట్టక చాలాకాలం సహించాను. ఇప్పుడు నువ్వు సహించక ఏంచేయగలవు?” అన్నాడు నారాయణభట్టు. “మరొకసారి నా కుక్క నడుంమీద కొట్టావో, నీ నడుం విరగగొడతాను,” అన్నాడు మల్లుడు పళ్ళు కొరుకుతూ. “అలా అయితే, దాని తల మీద కొడతాను. చూస్తూ ఊరుకో!” అన్నాడు నారాయణభట్టు. ఆ మాటకు మల్లుడు పట్టరాని ఆగ్రహం కొద్దీ కాళ్ళతో నేలను గట్టిగా తాటిస్తూ, “దాని తలమీద కొట్టావో, నీతల బద్దలు కొడతాను. కాళ్ళమీద కొట్టావో, నీ కాళ్ళు విరగగొడతాను! తెలిసిందా?” అన్నాడు. “ఆఁ, బాగాతెలిసేట్టుచెప్పావు! ఇక నుంచి రాత్రివేళ నీకుక్క నాకు నిద్రాభంగం కలిగించిందో, వెంటనే వచ్చి దాని జల్లితోక నజ్జునజ్జయ్యేలా కొడుతూంటాను!” అంటూ నారాయణభట్టు అక్కణ్ణించి కదిలాడు.
మల్లుడికి నారాయణభట్టు చమత్కారం అర్థమై, పెద్దగా నవ్వుకుని, తన కుక్కకు రాత్రివేళ ఉట్టినే మొరక్కుండా తగిన శిక్షణ ఇవ్వాలనుకున్నాడు.