తెలివిమీరిన యాత్రికుడు
సాధుబాబా అనే ఒక సన్యాసి తీర్థయాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఎల్లప్పుడూ దేశాటనలోనే ఉండేవాడు. మార్గమధ్యంలోని ఒక్కొక్క గ్రామంలోనూ, పట్టణంలోనూ ఒకటి రెండు రోజులకు మించి ఆగేవాడు కాదు. సన్యాసిగనుక ఆయన వద్ద ఒక జత బట్టలు, కంచుపాత్ర తప్ప వేరేదీ లేదు. ఆ రెండినీ ఒక జోలెలో వేసుకుని, భుజానికి తగిలించుకుని వెళుతుండేవాడు. ఆయన బసచేసిన చోట భక్తులు ప్రీతితో భోజనం పెట్టేవారు. ఒక్కొక్కసారి సాధుబాబా వెంట శిష్యుల్లా ఒకరిద్దరు యాత్రికులు వెళ్ళేవారు. సాధుబాబాలాంటి పుణ్యపురుషుడితో కలిసి తీర్థయాత్ర చేసి వస్తే మరింత పుణ్యం లభిస్తుందని వాళ్ళ నమ్మకం. బాబా దారిపొడవునా, మంచి మంచి కథలు చెప్పడంవల్ల నడిచేప్పుడు వాళ్ళకు అలసట కూడా తెలిసేది కాదు. పైగా ఏ ఊరికి వెళ్ళినా బాబాతోపాటు భక్తుల ఇళ్ళల్లో తమకూ మంచి భోజనం ఉచితంగా లభిస్తుందని కూడా ఆయన వెంట కొందరు యాత్రలకు బయలుదేరేవారు. ఆ విధంగా సాధుబాబా ఒకసారి ఇద్దరు యాత్రికులతో కలిసి శ్యాంపూర్కు వచ్చాడు. ఆ ఊళ్ళో లాలూసేథ్ అనే ఒక ధనిక వర్తకుడు ఉన్నాడు. ఆయన వడ్డీవ్యాపారం కూడా చేస్తాడు. పిల్లికి బిచ్చం పెట్టని పరమపిసినారి అనీ, దురాశపరుడనీ సేథ్ పేరుపడ్డాడు. ఆ ఊరొచ్చిన సాధుబాబా ఒకటి రెండు రోజుల్లో జగన్నాథమందిరం వెలసిన పూరీ కి బయలుదేరుతున్నాడు అని తెలియగానే, లాలూసేథ్ తానూ ఆయనతోపాటు వెళ్ళాలనుకున్నాడ . “ఇప్పుడే తీర్థయాత్రకు వెళ్ళవలసిన తొందర ఏమిటి? అవన్నీ నెమ్మదిగా వృద్ధాప్యంలో చూసుకోవచ్చు కదా. నువ్వు ఎప్పటిలా వ్యాపారాలను అభివృద్ధి చేసే వ్యవహారాలపై దృష్టి పెట్టు,” అన్నాడు సాధుబాబా. “నాకు రాలేదుకానీ, వృద్ధాప్యం తమకు వచ్చేసింది కదా? తమవంటి పుణ్యాత్ములతో కలిసి వెళితేనే నాకు తీర్థయాత్రలు చేసిన పుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది. తమ సాహచర్యం నాకు ప్రధానం. అది లేకుంటే ఎన్ని సంపదలున్నా ఏమిటి ప్రయోజనం?” అన్నాడు సేథ్. బాబాకు మనుషుల మనస్తత్వం బాగా తెలుసు. సేథ్*కు చేసిన పాపాలను తీర్థయాత్రల ద్వారా ప్రక్షాళనం చేసుకుని పుణ్యం సంపాదించాలని ఉంది. అయితే, అందుకు దమ్మిడీ ఖర్చు కాకూడదు. బాబా వెంట వెళితే దారిలో తిండి ఖర్చులుండవు. అంతా ఆయన భక్తులే చూసుకుంటారు. అది సేథ్ ఎత్తుగడ అని బాబా గ్రహించాడు. అయినా బాబా, “కేవలం తీర్థయాత్రలు చేయడం వల్లా, పుణ్యస్థలాలు దర్శించడం వల్లా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు, నాయనా. అందుకు మనిషి ప్రాపంచిక బంధాలను తెంచుకోవాలి. యాత్రాసమయంలో లాభనష్టాలను గురించి ఆలోచించకూడదు. ఎలాంటి ఇహిక చింతలూ, విచారాలూ లేకుండా నువ్వు నిర్మల చిత్తంతో, దైవచింతనతో యాత్ర చేయగలనని అనుకుంటున్నావా?” అని అడిగాడు. “బాబా, ఈ ఒక్క నెలరోజుల పాటు నేను ఇంటిపట్టున లేకుంటే నా భార్యాపిల్లలు ఇంటి వ్యవహారాలను ఎలా నెట్టుకు రాగలరో చూడాలని ఉంది,” అన్నాడు సేథ్ తల పంకిస్తూ. “అంటే, ఈ ఒక్క యాత్రద్వారా బహుళ ప్రయోజనాలను సాధించాలనుకుంటున నావు, అంతే కదా,” అంటూ సాధువు మందహాసం చేసి ఊరుకున్నాడు.సేథ్ మరిద్దరితో కలిసి బాబా వెంట తీర్థయాత్రకు బయలుదేరాడు. అతడు తెచ్చుకున్న మూటను కూడా, పెద్దమనిషి అనే గౌరవం కొద్దీ మిగిలిన ఇద్దరు యాత్రికులు మోసుకు రావడం వల్ల, సేథ్ చేతులు ఊపుకుంటూ హాయిగా నడవసాగాడు. మార్గమధ్యంలో ఏ ఊళ్ళోనో ఆగి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పు ు, సేథ్ గుట్టు చప్పుడు కాకుండా పక్కనున్న అంగడి వీధిలోకి వెళ్ళి అక్కడ సరుకుల ధరలను తెలుసుకుని వచ్చేవాడు. ఆ ధరలను తమ గ్రామంలో అమ్మే వస్తువుల ధరలతో పోల్చుకునేవాడు. నడిచి వెళ్ళేప్పుడు దారిలో బాబా చెప్పే నీతి కథలనూ, వేదాంత విషయాలనూ అసలు వినేవాడు కాదు. వ్యాపార విషయాలను ఆలోచించుకుంటూ వెళ్ళేవాడు.ఒకనాడు సాయంకాలం సమయం, హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్మాయి. బాబా వెంట సేథ్, మరి ఇద్దరు యాత్రికులు ఒక చిన్న నదీతీరంలో నడిచి వెళుతున్నారు. నది నిండుగా ప్రవహిస్తున్నది. కొంతసేపటికి నదీప్రవాహం మరింత ఉధృతమయింది. ఎగువ ప్రాంతంలో కొండల మధ్య బాగా వర్షం కురిసినట్టుంది. నదీ జలంలో చిన్న, పెద్ద చెట్టుచేమలు, దుంగలు, ఏవేవో వస్తువులు కొట్టుకుపోతున్నా ి. “ఏమిటిది? నల్లగా ఉంది. కంబళి కాదు కదా?” అంటూ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న నల్లటి వస్తువును చూసి అడిగాడు సేథ్. “అవును. కంబళిలాగే ఉంది. అయినా మసకచీకటిలో స్పష్టంగా కనిపించడం లేదు,” అన్నాడు సహప్రయాణీకుడు.“చీ టి పడేలోగా మనం, అదిగో, ఆ కనిపించే గ్రామాన్ని చేరుకోవాలి. వేగంగా నడవండి,” అన్నాడు బాబా. “కొంచెం ఆగండి. కొట్టుకుపోతున్న కంబళిని తెచ్చుకుందాం,” అన్న సేథ్ రెండవ ప్రయాణీకుణ్ణి, “నువ్వు నదిలోకి దూకి, ఆ కంబళిని గట్టుకు లాగగలవా?” అని అడిగాడు. “ఇంత వేగంగా ప్రవహించే నదిలో ఈదగలంత ఈతగాణ్ణి కాదు. క్షమించండి,” అన్నాడు రెండవ ప్రయాణీకుడు. “నాకు ఈత వచ్చు కానీ, ఈది చాలా సంవత్సరాలయింది. అయితే, ఈత ఒకసారి నేర్చుకుంటే జన్మాంతం మరిచిపోము కదా,” అంటూ సేథ్ చొక్కా విప్పబోయాడు. “అయినా, ఆ కంబళి గొడవ ఇప్పుడెందుకు? నువ్వు తీర్థయాత్ర చేస్తున్నావు కదా? ఇలాంటి అల్ప విషయాలను పట్టించుకోకుండా నీ మనసును దేవుడి మీద లగ్నం చేయడం శ్రేయస్కరం,” అని హెచ్చరించాడు సాధుబాబా. “అంత విలువైన వస్తువు కళ్ళెదుటే కొట్టుకుపోతూంటే, చేతులు కట్టుకుని కూర్చోవడం మహామూర్ఖత్వం!” అంటూ సేథ్, బాబా వారిస్తున్నా వినకుండా నదిలోకి దూకేశాడు. ఈదుకుంటూ వెళ్ళి, ఆ నల్లటి వస్తువును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, కొంతసేపటికి దాంతో కలిసి సేథ్ కూడా వెల్లువ వాలుకు కొట్టుకుపోసాగాడు! “ఏమయింది? కంబళిని గట్టుకు లాగలేకపోతే, వదిలేసి నువ్వు వెనుదిరిగి వచ్చేయ్!” అని పిలిచాడు బాబా గట్టిగా. “నేను దానిని ఎప్పుడో వదిలేశాను. అయితే, అదే నన్ను వదిలిపెట్టడం లేదు!” అంటూ కేక వేశాడు సేథ్ ప్రాణభీతితో. ఆ తరువాత ఎలాంటి మాటలూ వినిపించలేదు. ప్రవాహంలో కొట్టుకువచ్చింది కంబళి కాదనీ, ఎలుగుబంటి అనీ తరువాత తెలియవచ్చింది. హఠాత్తుగా కురిసిన వానలో తడిసిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోతున్నద . దగ్గరికి వచ్చిన లాలూసేథ్ ను పట్టుకున్న తరువాత అతన్ని వదిలిపెట్టడానికి దానికి మనసు రాలేదు!
