వెలుగు – నీడ
కోదండరామయ్య పేరు తెలియనివారు, ఆ ఊళ్ళో ఎవరూ వుండరు. ఆయన పేరుమోసిన వస్త్రాల వ్యాపారి. చిన్నతనం నుంచీ వ్యాపారంలో అనుభవం గడించి ఎంతో డబ్బు, కీర్తి ప్రతిష్ఠలను సంపాదించాడు. అంత డబ్బున్నాఆయన సాధారణ జీవితం గడుపుతూండేవాడు. సాదాసీదా నూలు వస్త్రాలు ధరించేవాడు. అతి సాధారణ భోజనం తీసుకునేవాడు. అలాగని ఆయన పిసినారి కూడా కాదు. ఆపదలో వున్న పేదవాళ్ళకు ధనసహాయం చేస్తూండేవాడు. కోదండరామయ్య దగ్గర ఎంతోకాలం నుంచి పనిచేస్తూ వస్తున్న రంగయ్య, ఎన్నోసార్లు తన మనసులోని సందేహకొద్దీ, “అయ్యా, తమకేం తక్కువ! జీవితం అనుభవించడానికే గదా వున్నది. మీరెందుకు విలాసంగా ఖర్చుపెట్టి ఆనందంగా వుండరు?” అని అడిగేవాడు. కానీ కోదండరామయ్య బదులు చెప్పకుండా నవ్వి ఊరుకునేవాడు. ఇలా వుండగా – అనుకోకుండా ఒకసారి కోదండరామయ్యకు వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. ఊహించని ఈ నష్టం కారణంగా ఆయన సర్వస్వం కోల్పోయాడు. ఈ స్థితిలో తన యజమానిని చూసి, రంగయ్య గుండె చెరువయ్యింది. అతడు, “అయ్యో, ఎంతో ధనవంతుడిగా బతికిన మీరు, ఇప్పుడు ఒక పేదవాడిలా ఎలా బ్రతకగలరు?” అన్నాడు ఎంతో విచారంగా.దానికి కోదండరామయ్య చిరునవ్వు నవ్వి, “రంగయ్యా, నేను ధనవంతుడిగా ఎప్పుడూ జీవించలేదు. బాగా డబ్బున్నప్పుడు కూడా పేదవాడిలాగానే బ్రతికాను. సుఖం ఒక చుట్టం; కష్టాలే శాశ్వతం. బ్రతుకు వెలుగు – నీడల సమ్మేళనం అన్నది వాస్తవం! డబ్బున్నది గదా అని విలాసవంతంగా బ్రతికితే, అది లేని రోజుల్లో బ్రతుకు నరకప్రాయంగా అనిపిస్తుంది. పరిస్థితి బాగున్నప్పుడు కష్టాల్లో వున్నవారికి సాయపడ్డాను. వాళ్ళల్లో కొందరు, నాకిప్పుడు సాయంగా వున్నారు,” అన్నాడు. ఆ తర్వాత కొద్దికాలానికే కోదండరామయ్య నష్టాల నుంచి బయటపడి, తిరిగి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు.
