nightlight
29-06-2026, 12:14 PM
భల్లూక మాంత్రికుడు - మొదటి భాగం
ముఖ్య గమనిక:- ఇప్పటినుండి నేను కొన్ని పెద్ద పెద్ద కథలను భాగాలు గా పోస్ట్ చేద్దాము అనుకుంటున్నా. మొదటి భాగం పోస్ట్ చేశాక, దానికి వచ్చిన ప్రత్యుత్తరాలను (రిప్లయ్స్) బట్టి దానిని కొనసాగించటమా లేక అపి వేయటమా అని నిర్ణయించుకొంటాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా, ఎటువంటి మొహమాటం లేకుండా ఆ విషయం రిప్లయ్ లో చెప్పండి . అధిక సభ్యులు ఆసక్తి కనబరిస్తే కొనసాగిస్తాను. సభ్యులు ఎటువంటి ఆసక్తి చూపని యెడల, తరువాతి భాగములు ఇంక నిలిపి వేస్తాను. కథ లోకి వెళ్దాము ఇంక.
పూర్వం బ్రహ్మపుత్రనదీ తీరపు అరణ్యాల్లోని ఒక గ్రామంలో, కాళీవర్మ అనే క్షత్రియ యువకుడు వుండేవాడు. అతడి తండ్రి మహాయోధుడు. చంద్రశిలానగరపు రాజు కొలువులో సైనికోద్యోగిగా వుంటూ, ఒక యుద్ధంలో మరణించాడు. అప్పటికి కాళీవర్మ పదేళ్ళ వయసు వాడు. అతడి తల్లి, భర్తపోయిన దిగులుతో త్వరలోనే చనిపోగా, బలభద్రుడనే విశ్వాసపాత్రుడైన నౌకరు, అతణ్ణి పెంచి పెద్ద చేసి, అన్ని క్షత్రియవిద్యలూ నేర్పాడు.
కాళీవర్మకు ఇరవై ఏళ్ళ వయసు నిండగానే, బలభద్రుడు అతడితో, "కాళీ, యిక నువ్వు కుగ్రామం వదిలి, రాజధానీ నగరానికి పోయి, అక్కడ రాజుగారి కొలువులో ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవటం మంచిది," అన్నాడు.
కాళీవర్మకూడా కొన్నిళ్ళుగా యిలాంటి ఆలోచనే మనసులో మెదులుతున్నది. కానీ, తమ ప్రాంతాలను పాలించే రాజు జితకేతు డంటే అతడి కేమాత్రం గౌరవం లేదు. రాజు పల్లె ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో సమర్థుడేకాని, వాళ్ళను వన్యమృగాల నుంచీ, బందిపోటుదొంగల నుంచీ కాపాడటంలో సమర్థుడు కాడు.
కాళీవర్మ యీ మాట బలభద్రుడితో చెప్పి, "ఆ చంద్రశిలానగరాన్ని పాలించే రాజు జితకేతు అసమర్థుడు, పిరికివాడు. అలాంటివాడి కొలువులో సైనికుడుగా చేరి పొట్టపోసుకోవటంకన్న మరి అవమానం వుండదు," అన్నాడు.
ముసలి బలభద్రుడు కాసేపు ఆలోచించి, "రాజుల పరిపాలనా దక్షత చాలావరకు వాళ్ళ ఆస్థానంలో ఉద్యోగులుగా వుండే వాళ్ళ మీద ఆధారపడి వుంటుంది. ఈ జితకేతు తండ్రి మహా పరాక్రమశాలి. నీ తండ్రిలాంటి ప్రతాపవంతులూ, బుద్ధిశాలూ అతడి కొలువులో వుండేవారు. ఆ రాజు మరణానంతరం యీ జితకేతు సింహాసనం ఎక్కాడు. నా అనుమానం అతడి చుట్టూ కుక్షింబరులూ, ముఖప్రీతి కబుర్లాడేవారూ చేరివుంటారని," అన్నాడు.
"అంతే కావచ్చు! అలాంటి రాజును నేనొక్కణ్ణే ఉద్ధరించగలనా? ఈ గ్రామంలోనే ఉన్న పొలం దున్నుకుని బతుకుతాను," అన్నాడు కాళీవర్మ.
"ఆ పని నీ లాంటి క్షత్రియయువకుడు చేయవలసింది కాదు. పైగా నీ తండ్రి మరణించేముందు, తన తుదికోర్కెగా నాకు చెప్పిపోయిందేమిటో తెలుసా?" అంటూ బలభద్రుడు ఇంటిలోపలికి దారితీసి, అక్కడ ఏనాడూ తెరవని గది తలుపులతాళం తీసి, కాళీవర్మను తన వెంట లోపలికి తీసుకుపోయాడు.
ఆ గదిలో కాళీవర్మ తండ్రి ఉపయోగించిన రకరకాల ఆయుధాలూ, కవచం, దాని పక్కన బంగారు పిడిగల కత్తీ వున్నాయి. బలభద్రుడు కత్తిని కాళీవర్మ నడుముకు బిగించి, కవచాన్ని తొడిగి, "ఆహాఁ, యివి నీకు అతికినట్టు సరిపోయాయి! క్షత్రియయోధుడుగా జన్మసాఫల్యం చేసుకోమని నీ తండ్రి ఆజ్ఞ; తరువాత నీ యిష్టం," అన్నాడు.
తండ్రి తన కోసం వదిలిపోయిన కవచం, కత్తి ధరించగానే కాళీవర్మ శరీరం పొంగిపోయింది. అతడు ఒరలో నుంచి కత్తిని లాగి, దాని పదును పరీక్షించి చూసి, దాని తళతళమనే మెరుపుకు అచ్చెరువుపడిపోతూ, "భద్రా, తండ్రిగారి ఆజ్ఞను శిరసావహిస్తాను! నా భవిష్యత్తును తీర్చిదిద్దవలసింది మొక్కపోయిన నాగటికర్రుకాదు; పదునైన యీ వాడి కత్తి," అన్నాడు.
ఆ మాటలకు బలభద్రుడు చాలా సంతోషించాడు. ఆ మర్నాడే కాళీవర్మ చంద్రశిలానగరానికి ప్రయాణమయేందుకు అన్నీ సిద్ధం చేశాడు. కాళీవర్మ కవచం ధరించి, కత్తిని నడుముకు బిగించుకుని, దారి ఖర్చులకుగాను నూరు బంగారుమాడలు తీసుకుని, గుర్రాన్నెక్కి బయలుదేరాడు. రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించిన తరువాత, ఆరు నెలల్లో తిరిగి ఒకసారి తప్పక గ్రామానికి వస్తానని బలభద్రుడికి, అతడు మాట యిచ్చాడు.
అరణ్య మార్గాల వెంట కాళీవర్మ ప్రయాణం, మిట్టమధ్యాహ్నం వరకూ ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా సాగింది. అతడు వెంట తెచ్చుకున్న రొట్టెలు తిని, ఏ చెట్టు కిందనైనా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామనుకుని, నీళ్ళ కోసం ఎక్కడైనా కొండవాగు కనబడుతుందేమో అని, మార్గం నుంచి గుర్రాన్ని పక్కకు తిప్పి కొంత దూరం పోయేంతలో, ఒక చెట్టు మీది నుంచి అతడికి పెద్దగా మూలుగు వినిపించింది.
కాళీవర్మ ఆశ్చర్యపోతూ తల ఎత్తి చెట్టు కొమ్మల్లోకి చూశాడు. కొమ్మల్లోంచి మానవాకారం ఒకటి చిన్నగా కేక పెట్టి, దభీమంటూ జారి, నేల మీద పడింది. కాళీవర్మ చప్పున గుర్రం దిగి ఆ మనిషి దగ్గరకు పోయాడు. అతడు బాగా వయసు మళ్ళినవాడు. పై నుంచి పడినందువల్ల అతడు గాయపడిన సూచన లేమీలేవు. ముసలివాడు లేచి నిలబడబోయి, నడుం పట్టుకుని పెద్దగా మూలిగి, తిరిగి నేల మీద చతికిలబడ్డాడు.
కాళీవర్మ అతణ్ణి సమీపించి, "ఏం, తాతా, యీ వయసులో నువ్వు చెట్టు ఎక్కటం ఏమిటి? జిహ్వచాపల్యం కొద్దీ తేనెతుట్టె కొట్టబోయావా?" అని అడిగాడు. ముసలివాడు, కాళీవర్మ కేసి ఒకటి రెండు క్షణాలు పరీక్షగా చూసి, "నాయనా, నువ్వేదో రాజుగారి భటుడిలావున్నావు, అవునా? సాధారణంగా పంటల తరుణంలో పన్నులు వసూలు చేసేందుకు తప్ప, మీరు యీ ప్రాంతాల మరేనాడూ కనబడరు గదా!" అన్నాడు.
"నేను రాజభటుణ్ణికాదు; ఆ ఉద్యోగం కోసం నగరానికి పోతున్నవాణ్ణి. నే నడిగిన దానికి జవాబు చెప్పావు కాదే ! తేనెతుట్టె ఎక్కడ? కాళ్ళూ, చేతులూ విరక్కపోవటం నీ అదృష్టం," అన్నాడు కాళీవర్మ.
ముసలివాడు మౌనంగా లేచి నిలబడి, నాలుగైదడుగులు నడిచి, తృప్తిగా తలాడిస్తూ, "నువ్వన్నట్టు అదృష్టవంతుణ్ణే. అలా కాకపోతే, యీసారి బందిపోటు దొంగలు గ్రామం మీద పడినప్పుడు, యింతనే వుండిపోయి, వాళ్ళవల్ల నానా హింసలూ పడవలసివచ్చేది," అన్నాడు.
ముసలివాడు యిలా అన్న తరువాత కాళీవర్మ సంగతి కొంతవరకు అర్థమైంది. ముసలివాడు బందిపోటుదొంగల నుంచి పారిపోయి వచ్చి, చెట్టు మీద దాక్కుని, అక్కడ పట్టుజారి కింద పడ్డాడన్న మాట!
"తాతా, యీ ప్రాంతాల బందిపోటు దొంగల బెడద జాస్తి అని నేనూ విన్నాను. కాని, వాళ్ళు పట్టపగలే గ్రామాలమీదపడి దోచుకుపోతారని వినలేదు. మీ వాళ్ళంతా ఏమయ్యారు?" అని అడిగాడు కాళీవర్మ.
"బందిపోట్లు రావటం చూస్తూనే అంతా తలోకదిక్కుకూ పారిపోయారు. వాళ్ళు గ్రామం వదలగానే ఒకళ్ళొకళ్ళు ఇళ్ళకు తిరిగి వస్తారు. ఇది మాకు మామూలే," అన్నాడు ముసలివాడు.
"ఈ బందిపోట్ల సంగతి రాజుగారికి తెలియపరచక పోయారా? ఆయన భటులను పంపి, వాళ్ళను వేటాడించేవాడు," అన్నాడు కాళీవర్మ, రాజు సంగతి తెలిసి వుండి, ముసలివాడు ఏం జవాబిస్తాడో చూద్దామని. తాత దిగులుగా ముఖం పెట్టి, "కబురంపకుండానే రాజుగారి భటులు వచ్చి, మా పంటల్లో సగం ఎత్తుకు పోతారు, మిగిలిన సగం యా చుట్టుపక్కల కొండల్లో వుండే బందిపోట్లు దోచుకుపోతారు. రాజుగారికి యా సంగతి తెలియందికాదు," అన్నాడు.
అంతలో చెట్లచాటు నుంచి నలుగురు బందిపోటు దొంగలు ముందుకు వస్తూ, "ఆహాఁ, ముసలివాడు మహా బాగా చెప్పాడు. ఇక ముందు ముందు పండిన పంటల్లో రాజుగారి భాగం కూడా మేమే పుచ్చుకోబోతున్నాం," అంటూ కత్తులెత్తి, కాళీవర్మతో, "కవచం, కత్తి, గుర్రం—నీ వాలకం చూస్తూంటే, వెంట నాలుగు డబ్బులు మోసుకొస్తున్న వాడిలాగే కనిపిస్తున్నావు. ఏదీ, ఆ డబ్బు సంచీ నేలమీద పెట్టి, నాలుగడుగులు వెనక్కు నడువు," అన్నారు.
కాళీవర్మ, దొంగల కేసి ఒకసారి తీవ్రంగా చూసి, గుర్రం దగ్గరకుపోయి, దాని జీను నుంచి వేళ్ళాడుతున్న చిన్న రొట్టెల మూటను తెచ్చి, నేల మీద పడవేసి, రెండడుగులు వెనక్కు నడిచాడు. దొంగల్లో ఒకడు ఆశగా ముందుకు వచ్చి, వంగి మూటను ఎత్తబోయేంతలో కాళీవర్మ చరున కత్తి దూసి, వాడి మెడను ఒక్కదెబ్బతో తెగవేసి, చప్పున ముందుకు దూకి, మరిద్దరు దొంగలను కత్తితో గుండెల్లో పొడిచాడు.
నాలుగో దొంగ ప్రాణభీతితో పెద్దగా అరిచి పారిపోబోయేంతలో, కాళీవర్మ పరుగు పరుగునపోయి వాడి జుట్టు పట్టుకుని, నడుం మీద గట్టిగా ఒక తన్ను తన్ని, వాడు కూలబడగానే, బర బరా ముసలివాడి దగ్గరకు యీడ్చుకు వచ్చాడు.
హఠాత్తుగా తనకళ్ళ ఎదుట ముగ్గురు దొంగలు హతం కావటం, నాలుగవవాడు కాళ్ళూ, చేతులూ కొట్టుకుంటూ, చావు కేకలు ప్రారంభించటం చూసి, ముసలివాడు వణికిపోతూ, "నాయనా, ఏమి నీ సాహసం! మా గ్రామంలో నీ కన్న బలం గల యువకు లెంతమంది లేరు! వాళ్ళే నాడైనా తెగించి, యా బందిపోట్ల నెదుర్కొని, ఒక్కగానొక్కణ్ణయినా చంపగలిగారా?" అన్నాడు.
"ఆ పని మీవాళ్ళచేత నేను చేయించి గాని, రాజధానికి పోను. ఆకలి సంగతి తరువాత; ఈ రొట్టెలమూట పట్టుకుని, నువ్వు ముందుండి మీ గ్రామానికి దారి తియ్యి. ఈ బందిపోటునూ, గుర్రాన్నీ నేను వెనకగా తీసుకువస్తాను," అన్నాడు కాళీవర్మ.
ముసలివాడూ, కాళీవర్మ అక్కణ్ణించి బయలుదేరబోయేంతలో, కొందరు గ్రామస్థులు అక్కడికి రొప్పుతూ, రోస్తూ వచ్చి, "తాతా, ఏమైంది? ఆ చావుకేకలు పెట్టిందెవరు?" అని అడిగారు.
కాళీవర్మ వాళ్ళకేసి అసహ్యపడుతూ చూసి, "మీలో గుడ్డివాళ్ళెవరూ వున్నట్టు లేదు. జరిగిందేమిటో కనబడటం లేదా? గ్రామాలమీద పడి దోచుకునే బందిపోటు దొంగలను కలిసికట్టుగా ఎదిరించటం పోయి పిరికి పందల్లా అరణ్యంలోకి పారిపోయే మీరు ఏమన్న మనుషులా?" అన్నాడు.
ఆ మాటలకు అందరూ తలలు వంచుకున్నారు, ముసలివాడు, వాళ్ళకు జరిగిందేమిటో చెప్పి, "ఒరే, మన గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల వున్న గ్రామాల్లోని నా బోటి ముసల ముతక జనాన్ని వదిలేసి, మిగిలినవాళ్ళు, యా కుర్రవాడిని పెద్దగా చేసుకుని, కొండల్లోని బందిపోట్లను దుంపనాశనం చేయండి. పట్టపగలే కొంపా గోడూ వదలి, అరణ్యంలో ఎంతకాలమని తల దాచుకుంటాం? మనం మనుషులమా లేక లేళ్ళూ, కుందేళ్ళలాంటి హీనజాతి జంతువులమా?" అన్నాడు కోపంతో నిలువెల్లా వణికిపోతూ.
కాళీవర్మ ఆ మాటలకు తృప్తిగా తలాడించి, "నే చెప్పాలనుకున్నది, మీ గ్రామ వృద్ధుడే చెప్పాడు. ఈ దొరికిన దొంగ ద్వారా, కొండల్లోని తతిమ్మా బందిపోట్ల స్థావరాలు తెలుసుకోవటం ఏమంత కష్టం కాదు. మీలో కత్తి, ఈటె పట్టగలవాళ్ళు, నా వెంటరండి. ఒక్క వారం రోజుల్లో బందిపోట్లనందర్నీ సర్వనాశనం చేసి, నా దారిన నేను పోతాను," అన్నాడు.
గ్రామస్థులు కాళీవర్మను సగౌరవంగా తమ గ్రామానికి తీసుకుపోయి విందు భోజనం పెట్టారు. ఆ సాయంకాలమే కొందరు యువకులు దూర గ్రామాలకు పోయి, మరి కొందరు యువకుల్ని తీసుకు వచ్చారు. కాళీవర్మ, వాళ్ళకు బందిపోట్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు.
దొరికిన బందిపోటు దొంగ అంతగా హింసపడకుండానే, కొండల్లోని ఏగుహలో, లోయలో ఎంతెంత మంది బందిపోట్లు వున్నారో, అక్కడికి వెళ్ళేందుకు వున్న రహస్య మార్గాలేమిటో కాళీవర్మకు చెప్పేశాడు.
కాళీవర్మ, గ్రామ యువకుల్ని వెంటబెట్టుకుపోయి, హఠాత్తుగా దాడులు చేసి, చాలామంది బందిపోట్లను చంపాడు. చావగా మిగిలినవాళ్ళు రాజ్య సరిహద్దులు దాటి, కొండల కావలనున్న అరణ్యాల్లోకి పారిపోయారు. బందిపోట్ల వేట ముగిసిపోగానే కాళీవర్మ తిరిగి రాజధాని నగరానికి బయలుదేరాడు. పదిహేను రోజుల ప్రయాణం తరువాత అతడు అరణ్యం దాటి, చంద్రశిలానగర పరిసరాలను చేరబోతూండగా, ఒకనాటి సూర్యోదయం వేళ, హఠాత్తుగా పదిమంది ఆశ్వికులు వచ్చి అతణ్ణి చుట్టుముట్టారు. కాళీవర్మకు, ఒర నుంచి కత్తిదూసేందుకుకూడా సమయం లేదు.
ఆశ్వికులనాయకుడు, అతడి కేసి కొరకొర చూస్తూ, "నువ్వు, కాళీవర్మవు కాదా? బందిపోట్లను రాజ్యసరిహద్దులలోని, అరణ్యాల నుంచి పొరుగు రాజ్యంలోకి పారదోలినవాడివి, నువ్వేగదా?" అని అడిగాడు.
"అవును, ఆ పని చేసింది నేనే! అలాంటి నన్ను ఎంతో గౌరవంగా నగరానికి తీసుకుపోయి, రాజదర్శనం చేయించడానికి బదులు, యిలా బందిపోటును చుట్టుముట్టి పట్టుకుంటున్నట్టు, పట్టుకోబోతున్నారేం?" అని అడిగాడు కాళీవర్మ ఆశ్చర్యపోతూ.
ఆ జవాబుకు ఆశ్వికుల నాయకుడు పెద్దగా నవ్వి, "నువ్వు, జితకేతు రాజుగారికి చేసిన ద్రోహం అంతాయింతాకాదు. ఇక్కణ్ణించి పారిపోయిన దొంగలు పొరుగు రాజ్యంలో బందిపోట్లు ప్రారంభించారు. ఆ రాజు, మా రాజుగారే యిందుకుకారణం అని, చంద్రశిలానగరం మీదికి దండెత్తి రాబోతున్నాడు. ఈ గొడవకంతకూ కారణం అయిన నిన్ను, ఉరితీసి, శవాన్ని ఆ రాజుకు పంపబోతున్నాం," అన్నాడు.
"ఆ జితకేతు రాజుతోపాటు మీకూ మతులు పోయినయ్యాయా!" అంటూ కాళీవర్మ కత్తి పిడిమీద చేయి వేయబోయేంతలో, ఆశ్వికులు అతడి మీదపడి కాళ్ళూ, చేతులూ కట్టి, గుర్రం మీదవేసి, ఉత్సాహంగా కేకలుపెడుతూ, నగరం కేసి బయలుదేరారు.
—(ఇంకావుంది)