లాగిన్

View Full Version : వానరసహాయం



nightlight
17-06-2026, 12:43 PM
వానరసహాయం
ఒక పట్టణంలో ఒక పేదరాలుండేది. ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడుగాని దమ్మిడీ కూడా వెనక వెయ్యకుండా, తన భార్యనూ, కుమారుణ్ణి బీదస్థితిలో ఉంచి చనిపోయాడు. అతని కొడుకు పేరు 'నిద్రమొహం' రంగడు.
తండ్రి పోయేసరికి రంగడికి పదిహేనేళ్ళు. కాని వాడికి కూచున్న చోటునుంచి కదిలే ఓపిక ఉండేది కాదు. వట్టి మన్నుతిన్న పాము. వాడు ఎప్పుడు చూసినా పడుకుని నిద్రపోతూండేవాడు.
"వాణ్ణి దేవుడు అట్లా సృష్టించాడు ఏం చేస్తాం?" అనుకుని రంగడి తల్లి, వాణ్ణి రొప్పు పెట్టకుండా, తానే నాలుగిళ్ళూ తిరిగి, దొరికిన కూలీ చేసుకుని, ఆ డబ్బులతో తన పొట్టా తన కొడుకుపొట్టా నింపుతూండేది. రంగడు తల్లి లేపినప్పుడు లేచి తిన్నంతనే మళ్ళీ పడుకుని నిద్రపోయేవాడు.
రంగడి ఇంటిపొరుగునే ఒక వర్తకుడుండేవాడు. ఆయన పేరు వరహాలశెట్టి. ఆయన వర్తకం మీద చైనాకు పోతున్నాడని రంగడి తల్లి విన్నది. అదృష్టవశాత్తూ ఆమెకు అప్పుడే నెలజీతం ముట్టింది. అందులో అయిదు వెండికాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ, "నాయనా, వీటిని వరహాలశెట్టికిచ్చి, చైనానుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకుతెచ్చి పెట్టమను. దానితో నువ్వు వర్తకం చేసుకుని బతుకుదువుగాని," అన్నది. తల్లి పోరగా, పోరగా రంగడు ముక్కుతూ, మూలుగుతూ లేచాడు, ఆవలించాడు. తల్లి దగ్గిర అయిదు కాసులూ తీసుకుని, నిద్ర మత్తుగా నడుస్తూ నడుస్తూ వరహాలశెట్టివద్దకు వెళ్ళి, తల్లిచెప్పిన నాలుగు ముక్కలూచెప్పాడు. రంగణ్ణి చూస్తే వరహాలశెట్టికి జాలి వేసింది. ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి? బాగుపడేదేమిటి? ఈ సంగతి తెలిసి కూడా, దయాగుణం గలవాడు కావటం చేత వరహాలశెట్టి, "అలాగేనాయనా!" అంటూ అయిదు వెండికాసులూ తీసుకున్నాడు. రంగడు మళ్ళీ ఇంటికి తిరిగి పోయి పడుకుని నిద్రపోయాడు.
వరహాలశెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకుని, ఓడ మాట్లాడుకుని, మంచి ముహూర్తం నిర్ణయించి లంగరు ఎత్తించాడు. అదృష్టవశాత్తూ దారిపొడుగునా గాలి అనుకూలించింది. ఓడ రేవు పట్టినచోటల్లా వర్తకులకు క్రయవిక్రయాలు బాగా సాగాయి. చివరకు ఓడ చైనాదేశం చేరింది. అక్కడవర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చీనాంబరాలూ, దంతపు సామానులూ, రత్నాలూ మొదలైనవి ఎవరి శక్తికొద్దీ వారు కొనుక్కున్నారు. మళ్ళీ ఓడ తిరుగుప్రయాణమయ్యింది.
పదిరోజులు గడిచాక వరహాలశెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన అయిదు వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది. అది పెట్టి ఏదైనా సరుకుకొనితెచ్చిపెట్టమన్నాడు రంగడు. వర్తకం హడావుడిలో ఆయన ఆ విషయమే మరిచాడు. పోనీ తాను కొన్నవాటిలో ఏదైనా రంగడికిద్దామా అంటే అంత చవుకైన వస్తువు ఏదీ లేదు. వరహాలశెట్టి మిగిలిన వర్తకులతో, "ఓడను మళ్ళీ చైనాకు తీసుకుపోదాం, ఇలా నావల్ల పొరపాటు జరిగిపోయింది," అన్నాడు. వారెవ్వరూ అందుకు ఎంతమాత్రం ఒప్పుకోలేదు.
కొన్నాళ్ళు గడిచాక, ఓడ తూర్పుదీవుల్లో ఒక రేవు చేరుకున్నది. ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు. వారిలో ఒకడి వెంట మూడు కోతులున్నాయి. అందులో రెండు చలాకీ అయినవి. యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి. మూడోకోతి ముసలిది. దానికి ఒక్క ఆట వచ్చినట్టు కనబడలేదు. మిగిలిన రెండూ ఆడుతుంటే అది దిగులు ముఖం పెట్టి సముద్రం మీదికిచూస్తూ కూచుంది.
ఆ కోతులను చూస్తూంటే వరహాలశెట్టికి ఒక ఆలోచన వచ్చింది. రంగడిచ్చిన అయిదు వెండికాసులతో ఒక కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు శెట్టి.
"అబ్బీ, ఆ కోతుల్లో ఒకటి అమ్ముతావా? అయిదు కాసులిస్తాను!" అన్నాడు శెట్టి కోతులాడించేవాడితో.
"ఈ ముసలి కోతిని తీసుకోండి, బాబూ!" అన్నాడు వాడు.
"పడుచు కోతినివ్వరాదురా?" అన్నాడు శెట్టి.
"వాటిని నూరు కాసులక్కూడా ఇవ్వను, బాబూ. అవే నా బతుకుతెరువు. ఈ ముసలి మొద్దును అయిదుకాసులకు కొన్నాను. తిండి దండగే తప్ప ఒక్క ఆటా రాదు. నేర్పినా నేర్చుకోదు. దాన్ని తీసుకోండి, బాబూ!" అన్నాడు కోతులాడించేవాడు బతిమాలుతూ.
చేసేది లేక వరహాలశెట్టి ముసలికోతిని కొని ఓడ ఎక్కాడు. అది కూడా రంగడిలాటిది గానే కనబడింది. తిండి తినేటప్పుడు తప్ప మిగిలిని అన్నివేళలా కునికిపాట్లు పడుతూ ఉండేది. దాన్ని కట్టివేసే అవసరం కూడా లేకపోయింది.
మరికొంత కాలానికి ఓడ ముత్యాలదీవి చేరింది. ఈ దీవిచుట్టూ సముద్రంలో ముత్యపు చిప్పలు దొరుకుతాయి. ఈ దీవిలో వుండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముత్యపు చిప్పలు పట్టుకువచ్చి చౌకగా అమ్ముతుంటారు. వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి. అదృష్టంలేనివారికి ముత్యపుచిప్పల వెలకూడా గిట్టదు.
ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే. ఓడ రేవు చేరగానే పల్లె కుర్రవాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తు కుంటూ వచ్చి నీటిలోకి దూకారు. అంతదాకా మన్నుదిన్న పాములాగా కూర్చుని ఉండిన కోతి ఈ కుర్రాళ్ళ కేకలు విని లేచి ఒక్క దూకున ఓడలోంచి సముద్రంలోకి దూకింది.
పాపం, రంగడిటికి కోతి కూడా దక్కదు కాబోలునని వరహాలశెట్టి భయపడ్డాడు. కాని కొద్దిసేపట్లో ఆ కోతి రెండుచేతులా ముత్యపు చిప్పలు రొమ్ముకు అదిమిపట్టుకుని ఈదుతూ వచ్చింది. ఓడలోకి ఎక్కి వాటిని ఒకచోట పెట్టి, మళ్ళీ సముద్రంలోకి దూకింది. చూస్తూండగానే అది దాదాపు ఒక వంద ముత్యపుచిప్పలు తెచ్చి పోగుపెట్టింది.
మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చిప్పలు వారు కొనుక్కున్నారు. ఏ ఒకరికి రెండుమూడు ముత్యాలకు మించి దొరకలేదు. అవయినా చాలా చిన్నవి. కొందరు అదృష్టహీనులకు ఒక్క ముత్యము బూ దొరకలేదు. కాని కోతి తెచ్చిన ముత్యపు చిప్పలలో అనేక పెద్ద ముత్యాలూ, చిన్న ముత్యాలూ దొరికాయి.
దీనికి కారణం ఉన్నది. ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాలదీవి మీదనే ఉండేది. దీని యజమాని ఒక పల్లెవాడు. వాడు దీనికి ముత్యపుచిప్పలు పట్టుకురావడం నేర్పాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. తరువాత దాన్ని ఏ పడవకళాసులో పట్టుకుని కొంతకాలం పెంచారు. అది అస్తమానం నిద్రమత్తుగా ఉండడం చూసి, దాన్ని మరొక దీవిలో కోతులాడించుకునే వాడికి చౌకగా అమ్మారు. అదే ఇప్పుడు రంగడి సొత్తయి, అప్పుడే వాడికొక నిధి పోగుచేసి పెట్టింది. కోతులనాడించేవాడు ఈ కోతిని తనవద్ద అంతకాలం ఉంచుకుని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు.
వరహాలశెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి వప్పజెప్పాడు.
ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకుని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడయ్యాడు. ముత్యాలదీవిచూడగానే కోతికి మత్తు వదిలినట్టే, చేసేటందుకు పనికనబడగానే రంగడి మత్తుకూడా వదిలింది. అతను ఏడాదికొకసారి తన కోతిని తీసుకుని ఓడమీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు, ముత్యాలచిప్పలు దొరికినన్ని తీసుకుని తిరిగి వచ్చేవాడు. బోలెడన్ని ముత్యాలు దొరికేవి. ఈ విధంగా రంగడు కొద్దికాలంలోనే గొప్ప ధనికుడై, పెళ్ళి చేసుకుని చాలాకాలం సుఖంగా బతికాడు.