PDA

View Full Version : వంటదయ్యం



nightlight
17-06-2026, 12:14 PM
వంటదయ్యం


కూనవరం గ్రామంలో ఉండే నాగరాజు, కూతురు సువర్చల పెళ్ళి కోసం, తనకున్న రెండెకరాల పొలం యాభైవేలకు అమ్మివేశాడు. సువర్చలకు, తండ్రి చేసిన ఈ పని ఇష్టం లేదు. ఆమె అతడితో, “నాన్నా, ఈ డబ్బులో సగం ఖర్చు చేసి ఒక ఇల్లు కొను. లేకపోతే నా పెళ్ళి అయ్యాక నీకు నిలవనీడ కూడా ఉండదు. పొలం ఆదాయం పోయాక నెలనెలా అద్దెలు కట్టడం కష్టం. నా పెళ్ళి కోసం అని నువ్వు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు,” అన్నది. ఆమె పట్టుదల వల్ల ఇల్లు కొనక తప్పలేదు, సువర్చల తండ్రికి. ఆ ఇల్లు ఆనందుడనే వాడిది. చిన్నతనంలో తండ్రి పోయిన ఆనందుడిని, తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. ఆనందుడు బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. తల్లి మరణంతో వాడికి డబ్బు సంపాయించడానికి ఎంత కష్టపడాలో తెలిసివచ్చింది. ఉద్యోగం ఏదీ దొరకక వాడు తాతల నాటి ఇల్లు అమ్మి, ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో సువర్చల తండ్రి నాగరాజు, పాతికవేలకు వాడి ఇల్లు కొన్నాడు. వారం రోజుల తరువాత సామానును రెండు ఎడ్లబండ్లలో సర్ది, అద్దెఇంటినుంచి సొంతఇంటికి మారారు సువర్చలా, ఆమె తండ్రీ. ఇల్లంతా సర్దుకునేసరికి బాగా పొద్దుపోయింది. వంట చేసే ఓపికలేని సువర్చల విధికేక పొయ్యి రాజేస్తూ, “ఈ పూటకు ఏ పుణ్యాత్మురాలో వచ్చి వంట చేసి పెడితే ఎంత బావుండును!” అనుకున్నది. ఆ మరుక్షణం, “ఈ ఒక్కపూటకేం ఖర్మ! ఇకనుంచి ఈ ఇంట్లో రెండు పూటలా నేనే వంట చేస్తాను?” అంటూ చేతిలో ఒక పెద్దగరిటతో ఒక ఆడదయ్యం గదిలో ప్రత్యక్షమయింది. దయ్యాన్నిచూస్తూనే కెవ్వుమన్నది సువర్చల. దయ్యం సువర్చలకు అభయమిస్తున్నట్లు కుడిచేతిలో వున్న గరిటెను గాలిలో తిప్పుతూ, “భయపడకు! నేను ఎవర్నో కాదు. స్వయానా నీకీ ఇల్లమ్మిన ఆనందుడి తల్లిని. వాడిప్పుడు ఇల్లమ్మగా వచ్చిన పాతికవేల రూపాయలతో ఏదో వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. బుద్ధి కుదరాలే గాని - వాణ్ణి మించిన బుద్ధిశాలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవడూ లేడు. ఇక నా సంగతంటావా? బతికుండగా, బతుకుతెరువుకు నాలుగైదిళ్ళలో వంట చేసే దానిని. ఇప్పుడు కనీసం ఒక ఇంట్లో - అదీ నా ఇంట్లో వంట చేయకపోతే మహాచెడ్డచిరాకుగా ఉంటుంది,” అన్నది. సువర్చల వణికిపోతూ ముందుగదిలో ఉన్న తండ్రికి జరిగినదంతా చెప్పింది. ఇది విని నాగరాజు హడలిపోయి, “మన ఖర్మకొద్దీ కొనక కొనక ఈ దయ్యాల కొంప కొన్నామన్న మాట!” అంటూ తలకొట్టుకున్నాడు. సువర్చల, తండ్రికి సర్దిచెపుతూ, “నాన్నా, నువ్వు దిగులుపడకు. చూడబోతే ఈ వంటదయ్యం మంచి, మర్యాద ఎరిగినదానిలా ఉంది,” అన్నది. నాగరాజు ఏదో అనబోయేంతలో, వంటగదిలోంచి దయ్యం, “భోజనం సిద్ధం! తండ్రీకూతుళ్ళు రావచ్చు,” అంటూ గరిటెతోకంచం మీద కొడుతూ కేక పెట్టింది. నాగరాజూ సువర్చలా బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వెళ్ళారు. భోజనం అద్భుతంగా వుంది. ఆ మాట దయ్యానికి చెప్పడం మంచిదా, కాదా అని సంశయిస్తున్నంతలో దయ్యం, “రేపు ఉదయంనుంచి చీకటితోనే వచ్చి, వంట చేసి వెళతాను,” అని చెప్పి మాయమయ్పోయింది.

ఈ విధంగా వంటపని తప్పడంతో సువర్చలకు, కొంత వీలు చిక్కింది. అయితే, వారం గడిచేసరికి దయ్యం వంట పట్ల ఆమెకు విసుగు పుట్టింది. దయ్యం ఒకే రకం వంటలు చేసేది. నూనె ఎక్కువ వాడేది. అది చీకటితో చేసిన వంట మధ్యాహ్నానికి చల్లారిపోయి బావుండేది కాదు. ఊరు మాటుమణిగాక వచ్చి దయ్యం రాత్రి వంట చేసేది. భోజనాలు ముగించేసరికి అర్ధరాత్రి య్యేది. అంతసేపు నిద్రకు ఆగడం కష్టంగా ఉండేది, నాగరాజుకు. ఒకనాటి ఉదయం చీకటివేళ దయ్యం రాగానే, సువర్చల దానితో, “నా వంట నేను చేసుకోగలను. నీ కొడుకు ఆనందుడి ఇంట్లో వండిపెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడట. ఈ వంట ఏదో అక్కడ చేయకూడదా,” అన్నది. “కూదనే కూడదు. నేను దయ్యమయ్యానని తెలిస్తే, వాడు చాలా బాధపడతాడు. వాడు రెండుచేతులా బాగా ఆర్జిస్తున్నాడు. కావాలంటే ఒకళ్ళని కాదు, ఇద్దరు నలభీములంటివాళ్ళను వంటకు కుదుర్చుకోగలడు!” అన్నది దయ్యం. సువర్చల మనస్సులో, ఇదేదో మొండి దయ్యం అనుకుని, సంశయిస్తూనే, “నీ వంట మాకు నచ్చడం లేదు,” అన్నది. ఆ మాట వింటూనే దయ్యం, “ఔరౌరా! నా వంటనే తప్పు పట్టడమా? నేనసలే మంచిదాన్ని కాను. తండ్రీ కూతుళ్ళిద్దరూ నేను చేసినదేదో నోరు మూసుకుని మరీ తినండి,” అంటూ బెదిరించింది. ఆ రోజునుంచీ కోపం కొద్దీ దయ్యం, కూరల్లో మరింత కారం, మరింత నూనె వేస్తూ పదిహేను రోజుల్లోనే నెలకు సరిపడా వెచ్చాలు ఖర్చు చేయడం మొదలుపెట్టింది. విధిలేక నెల మధ్యలో మళ్ళీ వెచ్చాలు కొని తెచ్చేవాడు నాగరాజు. ఇలా ఉండగా - ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రీ కూతుళ్ళు భోజనం చేస్తూ ఉండగా,సువర్చల చిన్ననాటి స్నేహితురాలు పట్నంనుంచి పొరుగుగ్రామంలో బంధువులఇంట జరుగుతున్న పెళ్ళికి వెళ్ళి సువర్చలను చూసి పోదామని వచ్చింది. ఆమె, తండ్రీకూతుళ్ళు అంత రాత్రివేళ భోజనాలు చేస్తుండడం చూసి, “ఈ వేళప్పుడు భోజనాలేమిటి?” అని అడిగింది. “గుడిలో హరికథ విని ఇప్పుడే వచ్చాం. సరే, బావున్నావు కదా?” అంటూ కుశలప్రశ్నలు వేసింది సువర్చల. తరువాత నడవా గదిలో మంచాలు వేసుకుని స్నేహితురాలిద్దరూ కొంతసేపు ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకున్నాక సువర్చల తాము ఇల్లు కొన్ననాటినుంచి వంటదయ్యం వల్ల పడుతున్న బాధల గురించి వివరించి, “ఈ వంటదయ్యం కొడుకు ఆనందుడనే ఆయన పట్నంలో రెండుచేతులా సంపాదిస్తున్నాడట. ఈ సంగతి ఆ దయ్యమే చెప్పింది. కొడుకింటికి పోయి, అక్కడ వంటపనుల్లో అతగాడికి సాయపడినా, పీడ విరగడైపోను!” అన్నది కోపంగా. ఇది విని రాధ ఎక్కడ లేని ఆశ్చర్యంతో, “ఏమిటేమిటి? ఈ వంటదయ్యం ఆనందుడి మాతృదేవతా? ఆనందుడు మా అన్నయ్యకు మంచి స్నేహితుడు. మా ఇంటికి వచ్చి పోతుంటాడు. వ్యాపారంలో మంచి దక్షత గలవాడు. తల్లికి ఈ ఇంటిమీద మమకారం పోనట్టే, అతడికి దీనిమీద మమకారం పోలేదు. అప్పట్లో అవసరం కొద్దీ పాతికవేలకు అమ్మానని, మా తాతముత్తాతల కాలంనాటి ఇల్ల ని మా అన్నయ్య దగ్గర బాధపడుతుం తాడు,” అన్నది. “పాపం, ఆ మహాగొప్ప వ్యాపారికి, ఇల్లు కొని మేము పడుతున్న బాధలు తెలియవు!” అన్నది సువర్చల ఉక్రోషంగా. రాధ కొంతసేపు మౌనంగా ఉండి, చప్పున మంచంమీదనుంచి లేచి కూర్చుని, “ఆహా! ఎంత చక్కని ఉపాయం తోచింది, సువర్చలా! మీ బాధలూ, ఆ ఆనందుడి బాధలూ తీరిపోయే ఉపాయం!” అని, సువర్చలకు చెవిలో రహస్యంగా ఏదో చెప్పి, “నీకు అన్ని విధాలా నచ్చితేనే! నచ్చితే మాత్రం వంటదయ్యానికి తెలియడం మంచిది కాదు గనక, శుభకార్యం పట్నంలోనే,” అన్నది. సువర్చల సిగ్గుపడిపోతూ, “సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం,” అన్నది. ఆ రోజు తెల్లవారుజామున వంటదయ్యం రాకముందే రాధ, బండిలో పట్నం వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత వచ్చిన వంట దయ్యంతో సువర్చల, “నాకూ, మా నాన్నకూ పట్నంలో అవసరం అయిన పనిబడింది. మధ్యాహ్నం బయలుదేరి వెళుతున్నాం. కనీసం పదిహేనురోజులు అక్కడే ఉండవలసి వస్తుంది,” అన్నది. ఇది విన్న వంటదయ్యం చిరాకుపడి, “ఈపాటి దానికి ఇంత సోదె ఎందుకు? పదిహేను రోజులు సెలవడుగుతున్నావన్నమాట, ఇచ్చాను! సెలవు ముగిసిన మర్నాటి కల్లా తిరిగిరాకపోతే, ఇల్లు పీకి పందిరేయగలను, జాగ్రత్త!” అన్నది. ఆ మధ్యాహ్నం సువర్చలా, నాగరాజూ బయలుదేరి పట్నం వెళ్ళారు. రాధ, ఆమె అన్నా పూనుకోవడంతో, వారం తిరక్కుండా ఆనందుడితో సువర్చల పెళ్ళి జరిగిపోయింది. ఆ తర్వాత వారంరోజులు పట్నంలోనే ఉండి సువర్చల, భర్తతో కలిసి తెల్లవారుజామున ఇంటికి తిరిగివచ్చేసరికి వంటదయ్యం గదిలో కొబ్బరిపచ్చడి నూరుతూ కనిపించింది. సువర్చల దాన్ని సమీపించి, “అయ్యో, అత్తయ్యా! మీ అబ్బాయికి పట్నం వెళ్ళాక ఇప్పుడు పచ్చళ్ళు నచ్చడం లేదు. బెండకాయ తాళింపు చెయ్యి,” అన్నది. వంటదయ్యం కళ్ళుంతచేసి ఆశ్చర్యపోతూ, “నువ్వు పట్నం వెళ్ళింది, మా అబ్బాయి ఆనందుణ్ణి పెళ్లాడ టానికన్నమాట !” అన్నది. “అవునత్తయ్యా! మీ అబ్బాయి కొన్నాళ్ళ పాటు, ఈ ఇంట్లోనే వుంటాడు. రోజు రెండు కూరలూ, పప్పుపులుసూ చేయండి. నా కోసం, కందిపొడి, నువ్వులపొడి అప్పుడప్పుడు చేయండి. అలసటగా ఉంది, వెళ్ళి పడుకుంటాను,” అన్నది సువర్చల ఆవిలిస్తూ. ఆ వెంటనే వంటదయ్యం కళ్ళెర్రజేసి, “ఆగాగు కోడలిపిల్లా! నీ గడుసుదనం ఇప్పటికి నాకు తెలిసింది. అత్తగారిచేత పనులు చేయిస్తూ, నువ్వెళ్ళి సుఖంగా నిద్రపోతావా? ఎవరో ఇంకొకరై ఉంటే విడిచిపెట్టే దాన్ని కాదు. సరే, నన్నిలా చూస్తే, నా కొడుకు బాధపడతాడు. నీ వంటగది నీకప్పగిస్తాను. నా కొడుకును జాగ్రత్తగా చూసుకో!” అంటూ మాయమైంది.
అత్తగారిమీది గౌరవం కొద్దీ సువర్చల, వంటదయ్యం గురించి భర్త ఆనందుడికి చెప్పలేదు. అమ్ముకున్న ఇల్లు దక్కినందుకే గాక, సువర్చల వంటి అనుకూలవతి భార్యగా లభించినందుకు ఆనందుడు ఎంతగానో సంతోషించాడు.